బీఆర్ఎస్, వైసీపీ మళ్లీ సెంటిమెంటును రాజేస్తున్నాయా..?
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో పార్టీలన్నీ తమ అమ్ములపొదిలో నుంచి అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా వివిధ రకాల ప్లాన్లు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీలు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నాయి. ఎప్పుడో విభజన సమయంలో రెండు ప్రాంతాల మధ్య తలెత్తిన విభేదాలను ఇప్పుడు మళ్లీ రాజేస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనేంత స్థాయిలో పోటాపోటీ విమర్శలు గుప్పించుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏపీ పార్టీలు సమర్థంగా పోరాడలేదని.. తాము ఉద్యమిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ప్లాంటును ప్రైవేటీకరించొద్దంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతేకాక, ఒకవేళ ప్రైవేటీకరణపై ముందుకెళ్తే తాము సింగరేణి తరపున బిడ్ లో పాల్గొంటామని ప్రకటించింది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ లోని పార్టీల బేలతనాన్ని ఎత్తిచూపేలా ఉంది. మంత్రి హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఏపీ పనైపోయిందని, అక్కడ ఏమీ మిగలలేదని, అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణ వచ్చేయాలని కామెంట్స్ చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.
తెలంగాణ నేతలపై వైసీపీ మంత్రులు, నేతలు మండిపడ్డారు. కేటీఆర్ సహా ఇతర నేతలకు వైసీపీ నేతలు సవాల్ విసిరారు. నోటితో నవ్వుతూ నొసటితో ఎక్కిరించే రకం కేసీఆర్ అన్నారు పేర్ని నాని. అంతేకాక, కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు హరీశ్ రావు సిద్ధంగా ఉన్నారన్నారు. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు తదితరులు కూడా హరీశ్ రావు, కేటీఆర్ కామెంట్స్ ను తప్పుబట్టారు. బీఆర్ఎస్ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందనడం వాళ్ల తెలివితక్కువ తనానికి నిదర్శనం అన్నారు. ప్లాంటును ప్రైవేటీకరించొద్దంటూ మొదట కేంద్రానికి లేఖ రాసింది జగనే అని గుర్తు చేశారు.
రెండు పార్టీలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కామెంట్స్ చేసుకోవడంతో మళ్లీ ఉద్యమకాలం నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు సెంటిమెంటు రాజేసి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని టీడీపీ, బీజేపీ, జనసేన లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇలా ఆరోపించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలన్నీ పక్కదారి పట్టి తెరమరుగవుతాయి. ఆ రెండు పార్టీల లక్ష్యం ఇదేననేది వాళ్ల ఆరోపణ. అంతేకాదు.. ఆ రెండు పార్టీలూ కలిసే ఈ నాటకమాడుతున్నాయని మరికొందరు ఆరోపిస్తున్నారు.












