Amaravati Act: అమరావతికి చట్టబద్ధత కోసం రైతుల పట్టు.. కారణం ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ఈ పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అమరావతి రాజధాని కోసం 33వేల ఎకరాలకు పైగా భూములు త్యాగం చేసిన వేలాది మంది రైతులు (Amaravati Farmers) ఒక కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించాలని, దానికి పార్లమెంట్ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని వారు ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) కోరారు. ఇందుకు ఆయన కూడా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రైతులు అమరావతికి చట్టబద్దత కోసం డిమాండ్ చేయడం వెనుక పలు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.
2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ (YS Jagan) ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా మూడు రాజధానులు ( 3 capitals ) అవసరమని ప్రతిపాదించింది. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జుడీషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ ప్రతిపాదన కోసం రెండు చట్టాలు కూడా తీసుకొచ్చింది. అయితే రైతుల నిరసనలు, చట్టపరమైన సవాళ్లతో ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత 2024 ఎన్నికల సమయంలో కూడా తాము మూడు రాజధానుల ఆలోచనకు కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులో మరింత బలమైన చట్టం తెస్తామని ప్రచారం చేశారు. దీంతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారు.
2014లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు, రైతులు తమ భూములను భూ సమీకరణ పద్ధతిలో ఇచ్చారు. ఈ ప్రక్రియలో వారికి రిటర్న్ ప్లాట్లు, ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి నిర్మాణం నిలిచిపోయింది. రైతులు ఇచ్చిన భూముల్లో అభివృద్ధి జరగలేదు. ఆర్థికంగా, మానసికంగా వాళ్లు నష్టపోయారు. ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే, అమరావతిని విస్మరించి మూడు రాజధానుల దిశగా వెళ్తారనే భయం రైతులను వెంటాడుతోంది. అందుకే, అమరావతికి చట్టబద్ధ హోదా కల్పిస్తే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చలేదని వారు భావిస్తున్నారు. రైతుల డిమాండ్‌పై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
అయితే అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజధానిని చట్టబద్ధంగా గుర్తించాలంటే, పార్లమెంట్ ద్వారా ఒక చట్టం ఆమోదించబడాలి లేదా కేంద్రం నుంచి గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాలి. ఇది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటం చంద్రబాబుకు అనుకూలం. అయితే ఈ ప్రక్రియలో రాజకీయ, చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.