AP vs TS: బనకచర్లపై రాజుకున్న పొలిటికల్ వార్..

ఏపీప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి బీజం వేసింది. ఈ ప్రాజెక్టు చేపడితే, రాయలసీమ కరువు కష్టాలు తీర్చవచ్చని ఏపీ భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్రంతో ఉన్న పొత్తును ఉపయోగించుకుంటోంది ఎన్డీఏ సర్కార్. అంతేకాదు.. ఈ సమస్యపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. దీంతో ఈసమస్యకు తెరపడిందని అందరూ భావించారు.
అయితే ఏపీ మంత్రి లోకేష్(Lokesh)… బనకచర్ల తేనెతుట్టె కదిపారు. వృధాగా సముద్రంలోకి పోయే జలాలను వాడుకుంటే తప్పేంటని లోకేష్.. తెలంగాణ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ నేతలు.. రాజకీయాల కోసం సెంటిమెంట్ రగిలిస్తున్నారని ఆరోపించారు. ఎవరేమనుకున్నా కచ్చితంగా బనకచర్ల చేపట్టి తీరతామన్నారు లోకేష్ . లోకేష్ ప్రకటనతో తెలంగాణలో పార్టీలు మండిపడ్డాయి. ఏపీ మంత్రులు.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయరాదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క(Bhatti Vikramarka). గత ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి ఉంటే.. ఈసమస్య వచ్చి ఉండేది కాదన్నారు. అవన్నీ తాము వాడుకోకపోవడం వల్లే కిందకు పోతున్నాయన్నారు భట్టి.
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాల మేరకే బనకచర్ల అనుమతులను సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించాయన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అభ్యంతరాలతో కేంద్రం పర్యావరణ అనుమతులు నిలిపివేసిందన్నారు.
కేంద్రం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకునే.. లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు మాజీమంత్రి హరీశ్ రావు(Harish rao). కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు తామెలాంటి ప్రయత్నాలు చేయలేదని లోకేష్ అంటున్నారని.. అయితే అది నిజం కాదన్నారు. దీనికి సంబంధించి లోకేష్… తన నాన్నను అడిగి తెలుసుకోవాలన్నారు. ఏదేమైనా..ఈ బనకచర్లను అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామన్నారు.