ఏపీలో ఆక్సిజన్ కొరత లేదు : ఏకే సింఘాల్

ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆక్సిజన్‌ను ఎక్కువగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ తెలిపారు. అయితే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత మాత్రం లేదని స్పష్టం చేశారు. స్టేట్ లెవల్ ప్రొక్యూర్ కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించామని, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కరోనా దృష్ట్యా విధించిన కొత్త నిబంధనలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎలాంటి నిబంధనలూ ఉండవని స్పష్టం చేశారు. అయితే సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఐదుగురికి మించి ఉండకూడదని తెలిపారు. మే మాసంలో 13 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఇస్తామని, 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పూర్తయ్యాకే, 18 నుంచి 45 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తామని ఆయన తెలిపారు.
ఏపీలో కొనసాగుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో 71 మంది మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,15,275 శాంపిల్స్‌ను సేకరించామని, 18,972 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే 10,227 మంది కరోనా నుంచి కోలుకున్నారని, 71 మంది మరణించారని ఆరోగ్య శాఖ పేర్కొంది. తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలో అత్యధికంగా 9 మంది చొప్పున కోవిడ్‌తో మృతి చెందారు. అనంతపురం, కర్నూలులో ఏడుగురు చొప్పున ప్రాణాలు విడిచారు.