బీఆర్ఎస్ పై ఏపీ మంత్రుల విమర్శలు అందుకేనా…? వాళ్లకు సీట్లు ఇవ్వడానికి కేసీఆర్ రెడీగా ఉన్నారా…?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఏ విధంగా అడుగుపెట్టే అవకాశం ఉందనే దానిపై చాలానే చర్చలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఆ పార్టీ తెలంగాణాలో బలంగా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ప్రభావం చూపడం కాస్త కష్టమే. సిఎం కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కోపం ఉంది. ఆ కోపాన్ని ఇప్పుడు తగ్గించాలనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారు. అందుకే కేంద్రం అమ్మాలి అనుకుంటున్న విశాఖ ఉక్కుని తాను కొంటాను అంటూ ఆయన ముందుకి వచ్చారు. ఇక మంత్రి హరీష్ రావు కూడా ఏపీ సర్కార్ పై విమర్శలు మొదలుపెట్టారు.
దానికి ఏపీ మంత్రులు కూడా దీనిపై కౌంటర్ ఇస్తున్నారు. ఉన్నపళంగా ఇప్పటికిప్పుడు ఎందుకు విమర్శలు మొదలుపెట్టారు అనే దానిపై చాలానే చర్చలు ఉన్నాయి. దీనిపై పలువురు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ఆశ్చర్యకరంగా ఉంది. ఏపీ మీడియా వర్గాల్లో బీఆర్ఎస్ కు స్పేస్ కల్పించడానికే అని, దాని ద్వారా టీడీపీని కట్టడి చేయవచ్చని అధికార పార్టీ భావిస్తుందని, అందుకే కీలక మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే పలువురు కాపు నేతలను చేర్చుకోవాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నారు.
ఆ తర్వాత విమర్శలను మరింత స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు. దీనిపై ఏపీ అధికార పార్టీ ఎంత స్పందిస్తే బీఆరఎస్ కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తుంది. దీనితో తెలుగుదేశం, జనసేన పార్టీలకు మీడియాలో స్పేస్ ఉండటం కష్టమే అంటున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఈ పరిస్థితి కాస్త టీడీపీకి ఇబ్బందే. అభ్యర్ధులను కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రకటించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్లకు కూడా గాలం వేసి, వైసీపీలోకి వెళ్ళలేని వారిని తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. జనసేన, టీడీపీ పొత్తులో సీటు రాని వారికి హామీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.













