ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా?… చరిత్రలో మొట్టమొదటిసారిగా
ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీతాలు ఆలస్యమైనా రెండేళ్లుగా భరిస్తూ వస్తున్నామని, జాప్యం చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. జీతాలు, పెన్షన్లు 20వ తేదీ అయినా ఇవ్వడం లేదన్నారు. జీత భత్యాల కోసం ఉద్యోగులు రోడ్లు మీదకు వచ్చే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. బకాయిలు అడగకూడదనే ప్రభుత్వం తమ జీతాలు ఆలస్యం చేస్తోందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేయాలంటే భయపడుతున్నారని పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీత భత్యాల చెల్లింపు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జీతభత్యాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా? చరిత్రలో మొట్టమొదటిసారిగా జీతాలు, పెన్షన్ల కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు.













