ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధార్మిక పరిషత్లో సభ్యుల సంఖ్యను తగ్గించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ధార్మిక పరిషత్లో సభ్యుల సంఖ్యను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పాలెపు శ్రీనివాసులు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించింది. ధార్మిక పరిషత్లో 21 మంది సభ్యులు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం సభ్యుల సంఖ్యను 21 నుంచి 4కు కుదించారని, ఆ నలుగురు కూడా అధికారులేనని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఎలా సభ్యులను కుదిస్తారని ఏ ప్రాతిపదికన ఇలా చేశారని ప్రశ్నించింది. నలుగురినే నియమించడం సుప్రీం తీర్పును అమలు చేసినట్లు కాదు కదా అని అసహనం వ్యక్తం చేసింది. టీటీడీ దేవస్థానం పిటిషన్లతో కలిసి విచారించే విధంగా పోస్టింగ్ వేయాలని దర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.













