హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో
పోలవరం ప్రాజెక్టు వ్యయం వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం నుంచి విశాఖపట్నం నగరానికి మంచి నీరు అందించేందుకు కేటాయించిన రూ.7,214 కోట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కొట్టేసింది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని మొత్తం తామే భరిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం ఉల్లంఘిస్తే, దానికి కట్టుబడి ఉండాలని తాము ఆదేశాలు ఇవ్వలేమంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.













