రిటైర్డ్ ఐఏఎస్ కు నాన్ బెయిలబుల్ వారెంట్
రిటైర్డ్ ఐఏఎస్ ఉదయలక్ష్మికి ఆంధప్రదేశ్ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పీఈటీ అధ్యాపకుడి విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఆమె భేఖాతరు చేయడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. తనకు అన్యాయం చేశారని గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పీఈటీ రత్నకుమార్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. అతనికి న్యాయం చేయాలని అప్పుడు ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉదయలక్ష్మికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఆమె అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కారణగా పరిగణించిన హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ సమయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మిని హైకోర్టులో హాజరు పరచాలని గుంటూరు రూరల్ ఎస్పీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రస్తుత సీఎస్, గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. కాగా పిటిషనర్ తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు.













