ఆనందయ్య ‘కె మందు’ పంపిణీ చేయండి : హైకోర్టు ఆదేశం

ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆనందయ్య మందు విషయంలో ఏపీ హైకోర్టు ప్రజలకు మరింత ఊరట కల్పించింది. ఆనందయ్య కరోనా మందుకు సంబంధించి, కంటిలో వేసే చుక్కల మందు ‘కె మందు’ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆయుష్ నివేదికకు సంబంధించిన పూర్తి వివరాలు రాని నేపథ్యంలో ‘కె మందు’కు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలోనే కె మందు విషయంలో హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆనందయ్య ఇస్తున్న మిగితా కరోనా మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చి చెప్పాయి. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు తేల్చిన విషయం తెలిసిందే.
నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ మందును పంపిణీ చేయనున్నారు. గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ ప్రారంభించారు. రోజుకు 2 నుంచి 3 వేల మందికి ఈ మందును పంపిణీ చేస్తామని ప్రకటించారు. అల్లోపతి మందులు వాడుతూనే, ఆనందయ్య మందును తీసుకోవచ్చని సూచించారు. ప్రజలకు మేలు చేస్తుందన్న భావనతోనే ఈ మందు పంపిణీని ప్రారంభించామని, త్వరలోనే ఇతర జిల్లాలకు కూడా ఈ మందు పంపిణీ చేస్తామని కాకాని పేర్కొన్నారు.