ఆ కుటుంబాలకు రూ.30 లక్షలు సాయం : వైఎస్ జగన్
ఛత్తీస్గడ్లో జరిగిన మావోయిస్టుల దాడి ఘటనలో జవాన్ల మృతి పట్ల ఆంధప్రదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూర్తి మురళీకృష్ణ మృతి చెందారు. అమర జవాన్ల కుటుంబాలకు చెరో రూ.30 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.













