Komera Jaji: ప్రకృతి రక్షకుడికి అరుదైన గౌరవం… కొమెర జాజి కథేంటి..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అంకారావు (Anka Rao) అలియాస్ కొమెర జాజి (Komera Jaji) అనే సామాన్య వ్యక్తిని అటవీ, పర్యావరణ శాఖ సలహాదారుగా (Advisor to Forest and Environment Department) నియమించింది. ఈ నియామకంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. పర్యావరణవేత్తలు ఈ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ప్రభుత్వంలో రాజకీయ నేతలను సలహాదారులుగా నియమించినట్లు విమర్శలు వచ్చాయి. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy. CM Pawan Kalyan) సామాన్యుడైన కొమెర జాజిని ఎంపిక చేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కొమెర జాజి అసలు పేరు అంకారావు. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలోని కారంపూడి ఈయన సొంతూరు. ఆయన వయస్సు 43 ఏళ్లు. బీఏ వరకు చదివి, జ్యోతిష శాస్త్రంలో డిప్లొమా పూర్తి చేశారు. ప్రస్తుతం ఎమ్మే చదువుతున్నారు. వివాహితుడైన జాజికి ఇద్దరు సంతానం. అతని జీవితం పూర్తిగా ప్రకృతితో మమేకమై ఉంది. చిన్నప్పటి నుంచే అడవులు, కొండలు, కోనల్లో సంచరిస్తూ ప్రకృతితో మమేకమయ్యాడు. నల్లమల అటవీ ప్రాంతం అతనికి సొంత ఇల్లులా సుపరిచితం.
కొమెర జాజి ప్రకృతి పరిరక్షణకు చేస్తున్న కృషి అసాధారణం. అతను నల్లమల అడవుల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో చెల్లాచెదురుగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఒంటరిగా సేకరించి తొలగించారు. సంచి భుజాన వేసుకుని, అడవుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ప్లాస్టిక్ కాలుష్యం అడవులకు, వన్యప్రాణులకు ఎంతటి హాని కలిగిస్తుందో అతనికి బాగా తెలుసు. అందుకే ఈ సమస్యను తన వ్యక్తిగత బాధ్యతగా భావించి పనిచేశాడు. జాజి కేవలం వ్యర్థాల సేకరణకే పరిమితం కాలేదు. అతను కోట్లాది సీడ్ బాల్స్ ను నల్లమల అడవుల్లో చల్లారు. ఇవి వర్షాకాలంలో మొలకెత్తి చెట్లుగా పెరుగుతాయి. ఈ పద్ధతి ద్వారా అతను అడవుల పునరుద్ధరణకు గణనీయంగా దోహదపడ్డారు.
జాజి తన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి ‘ప్రకృతి సంరక్షణ సేవా సంస్థ’ అనే ఎన్జీవోను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అతను కోటి మొక్కలు నాటాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. కారంపూడి సమీపంలోని అడవిలో ‘ప్రకృతి ఆశ్రమం’ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమం పర్యావరణ అవగాహన కేంద్రంగా పనిచేస్తుంది. అతను రైతులకు మొక్కల ఔషధ గుణాల గురించి వివరిస్తూ, వాటిని నాటేలా ప్రోత్సహిస్తున్నారు. మూలికలు, ఆకులు, ఇతర సహజ దినుసులను సేకరించి, వాటితో సాంప్రదాయ వైద్యం కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 300 పాఠశాలల్లో 3,000 మంది విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించారు.
ప్రకృతి పరిరక్షణకు జాజి చేస్తున్న అసాధారణ కృషిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఐఎఫ్ఎస్ చదవకపోయినా, నిజమైన అటవీ అధికారిలా పనిచేస్తున్న అతని నిబద్ధత గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అతన్ని అటవీ, పర్యావరణ శాఖ సలహదారుగా నియమించారు. సోషల్ మీడియాలో జాజి నియామకాన్ని ‘ప్రకృతి పట్ల బాధ్యత గల వ్యక్తికి దక్కిన గౌరవం’గా అభివర్ణిస్తున్నారు. అతని నిస్వార్థ సేవ యువతకు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. గత ప్రభుత్వంలో రాజకీయ నేతలను సలహాదారులుగా నియమించడంపై విమర్శలు ఉన్న నేపథ్యంలో జాజి నియామకం ప్రజల్లో హర్షాన్ని కలిగించింది.
జాజి తన ఎన్జీవో ద్వారా అడవుల పునరుద్ధరణ, ప్లాస్టిక్-రహిత అటవీ ప్రాంతాల సృష్టి, విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం కల్పించడం వంటి లక్ష్యాలతో పనిచేస్తున్నారు. సలహాదారుగా అతని పాత్ర ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ విధానాలకు కొత్త దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రకృతి సంరక్షణలో అతని అనుభవం, స్థానిక అవసరాలపై అవగాహన ప్రభుత్వ విధానాలను మరింత చేరువ చేయగలవు. ఈ నియామకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు తన నిబద్ధతను చాటుకుంది. జాజి లాంటి వ్యక్తులు ఉన్నంత కాలం ప్రకృతి సురక్షితంగా ఉంటుందని నమ్మవచ్చు.