కొత్త జిల్లాలకు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించి, ఆర్డర్ టు సెర్వ్ ప్రకారం ఆ జిల్లాల్లో వారి సేవలను వినియోగించుకోనుంది. మార్చి 11వ తేదీలోపు తాత్కాలిక కేటాయింపులు పూర్తి చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశించారు. కొత్త జిల్లాల అపాయింటెడ్ తేదీ నుంచి అధికారులు, ఉద్యోగులు కేటాయించిన చోటు నుంచి పని చేసేలా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇందు కోసం ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించారు. ప్రస్తుతం పని చేస్తున్న వారిని ఆ జిల్లాల్లో తాత్కాలికంగా కేటాయించి, ఆ తర్వాత అవకాశాన్ని బట్టి పూర్తి స్థాయి విభజన చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాల హెచ్ఓడీలు, ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ సమీర్ శర్మ జారీ చేశారు.
తాత్కాలిక కేటాయింపులో జిల్లా, డివిజినల్ కార్యాలయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర, రీజినల్/జోనల్, మండలం, గ్రామ స్థాయిలో పరిగణనలోకి తీసుకోకూడదు. జిల్లా, డివిజినల్ స్థాయిలో తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న కార్యాలయాలను కేటాయింపులో వదిలేయాలి. ఆ కార్యాలయాలు ప్రస్తుతం కొనసాగే జిల్లాల పరిధిలోనే ఉండేలా చూడాలి. తుది కేటాయింపు పూర్తయ్యే వరకు తాత్కాలిక కేటాయింపు ప్రకారం పనిచేసే వారి సీనియారిటీపై ఎలాంటి ప్రభావం ఉండదు. జిల్లా/డివిజన్ హెడ్ తప్ప కొత్తగా ఏ పోస్టు సృష్టించకుండా కేటాయింపులు జరపాలి. ఉద్యోగులు, అధికారుల తాత్కాలిక కేటాయింపు చేపట్టిన విభాగాధిపతులు ఈ సూత్రాలను కచ్చితంగా పాటించాలి. జిల్లా పరిధి ఉన్న అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను తాత్కాలిక కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోవాలి.
వ్యవసాయ శాఖ జేడీ, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. జిల్లా స్థాయి ఉన్నా జిల్లా పరిధి లేని కార్యాలయాలను కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోకూడదు. డివిజనల్ ఫారెస్ట్ అధికారి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. డివిజనల్ స్థాయి పోలీసు కార్యాలయాలు తమ పరిధిని మార్చకుండా ప్రస్తుతం ఉన్న చోటు నుంచే పని చేయాలి. అలాగే అన్ని శాఖలు జిల్లా స్థాయి పరిపాలనా యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఒకే తరహా క్యాడర్ ఉన్న అధికారి పోస్టును సంబంధిత శాఖకు హెచ్ఓడీ కోసం ఉపయోగించుకోవాలి. కొత్త జిల్లాల్లో హెచ్ఓడీ పోస్టుల్లో తాత్కాలిక నియామకాల కోసం సమాన స్థాయి అధికారులతోపాటు దానికి ఒక ర్యాంకు పైన, ఒక ర్యాంకు తక్కువ క్యాడర్ అధికారుల పూల్‌ను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆదేశించారు. ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు మార్చి 11వ తేదీకల్లా ఇచ్చేలా ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయాలని సీఎస్ అన్ని శాఖల హెచ్ఓడీలు, ఆర్థిక శాఖను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తుది నోటిఫికేషన్ వెలువడే లోపు పూర్తి కావాలని కూడా అందులో పేర్కొన్నారు.













