Fibre Net : ఫైబర్ నెట్‌ను విచ్చలవిడిగా వాడేసిన విజయసాయి, వర్మ & కో…!?
రాష్ట్ర ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను అందించాలనే లక్ష్యంతో ఫైబర్ నెట్ (FibreNet) ను ఏర్పాటు చేసింది చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం. 2014-19 మధ్య ఫైబర్ నెట్ ద్వారా విస్తృత సేవలు అందించారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఫైబర్ నెట్ ద్వారా సేవలను విస్తరించాల్సిందిపోయి కుదించేశారనేది ఇప్పుడు బయటికొస్తున్న అంశం. అయిన వాళ్లకు అప్పనంగా సొమ్ములు దోచి పెట్టారని.. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండానే వైసీపీ నేతల సిఫారసులతో పెద్ద ఎత్తున నియామకాలు జరిపారని ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి (GV Reddy) వెల్లడించారు. ఫైబర్ నెట్ ను అప్పులకుప్పగా మార్చేశారన్నారు.
ఫైబర్ నెట్ ద్వారా టీవీ ప్రసారాలను, ఇంటర్నెట్ ను తక్కువ ధరకు అందించడం ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని సినిమాలను కూడా కొనింది. ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు నిర్మించిన సినిమాలను ఫైబర్ నెట్ ద్వారా కొనుగోలు చేసి వాటికి పెద్దఎత్తున డబ్బులు చెల్లించింది. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వం వహించిన వ్యూహం (Vyuham) సినిమా దేనికి సంబంధించిందో మనందరికి తెలుసు. ఆ సినిమాను ఫైబర్ నెట్ కొనుగోలు చేసింది. దానికి రామ్ గోపాల్ వర్మకు (RGV) రూ.2.15కోట్లు చెల్లించింది. వాస్తవానికి వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. ఆ నిబంధనలేవీ పాటించలేదు. ఒక్కో వ్యూకు రూ.100 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన మొత్తం వ్యూస్ 1863 మాత్రమే. కానీ వర్మకు చెల్లించింది 2కోట్ల 15 లక్షలు.
నిధుల చెల్లింపులోనే కాదు.. నియామకాల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు ఆడిటింగ్ లో తేలింది. 2019 వరకూ ఈ సంస్థలో కేవలం 108 మంది మాత్రమే ఉద్యోగులు ఉండేవారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక 1360 మంది ఉద్యోగులను నియమించారు. వీళ్లంతా సిఫారసుల మేరకు నియమించిన వాళ్లే. ఎలాంటి అర్హతలను పరిగణనలోకి తీసుకోలేదు. కొంతమంది వైసీపీ నేతల ఇళ్లలో పనిచేస్తున్నవాళ్లను కూడా ఇందులో ఉద్యోగులుగా చేర్పించి జీతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2019 వరకూ జీతాలకు రూ.40లక్షలు మాత్రమే ఖర్చయ్యేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం జీతాలకోసం రూ.4 కోట్లు చెల్లిస్తూ వచ్చారు.
అన్నిటికీ మించి ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) వాట్సాప్ లో సిఫారసు మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెల్లెళ్లకు ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు ఇచ్చారు. ప్రియాంక, ఇందిరా ప్రియదర్శిని అనే ఇద్దరు శాంతి చెల్లెళ్లు ఫైబర్ నెట్ లో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. అంతేకాక చంద్రబాబు నాయుడిపై ఫైబర్ నెట్ కేసు నమోదైంది. ఆ ఫైల్ ను శాంతి సోదరే డీల్ చేసినట్లు సమాచారం. ఇందులో అవకతవకలు ఏమైనా జరిగాయా అనే దానిపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఫైబర్ నెట్ విజయసాయి రెడ్డి, వర్మ సహా వైసీపీ నేతలు విచ్చలవిడిగా వాడేసుకున్నారు.













