విద్యా రంగంలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సర్కార్

విద్యా రంగంపై జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టి నిలిపింది. ముఖ్యంగా పాఠశాల విద్యపై మరింత దృష్టి సారించింది. ఇప్పటికే నూతన విద్యా విధానాన్ని అమలు చేసి, ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు. తాజాగా… పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు ప్రపంచ బ్యాంకు సహాయాన్ని కూడా తీసుకోనున్నారు. ‘‘ఏపీ అభ్యసన పరివర్తన సహాయ పథకం’’ (సపోర్టింగ్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్ఫఫర్మేషన్) అనే నూతన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. దాదాపు వెయ్యి 80 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇది ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు అని, ఫలితాలను రాబట్టే ఏకైక లక్ష్యంతో ప్రపంచ బ్యాంకు సహాయం అందిస్తోందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ పథకం పటిష్టాత్మకంగా అమలు కావడం కోసం ఓ ఐఏఎస్ అధికారిని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ ఉపాధ్యాయులకు శిక్షణ నివ్వడం, పాఠశాల భద్రత, పాఠశాలలో విద్యార్థుల లీడర్లకు శిక్షణ నివ్వడం, పనితీరును ఆధారంగా చేసుకొని ఓ డేటాను రూపొందించడంతో పాటు పాఠశాల విద్యలో సమూల మార్పులు తీసుకురావడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. మరోవైపు 10, ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం ఓ నిపుణుల కమిటీని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. మూల్యాంకనం ఎలా వుండాలన్న దానిపై ఈ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించనుంది.