వ్యాక్సిన్ తయారీకి ఎవరైనా ముందుకు వస్తే ఓకే చెప్పండి : మోదీకి సీఎం జగన్ లేఖ
ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని జగన్ కోరారు. ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నా, అది ఏ మాత్రం సరిపోవడం లేదని స్పష్టం చేశారు. మరో 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు, కర్నాటక నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటున్నామని, ఈ నెల 10 న చెన్నై, కర్నాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యమైందని, దీంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని లేఖలో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవ్యాక్సిన్ తయారీ దేశీలయ అవసరాలను పూర్తిగా తీర్చడం లేదని, ఈ వ్యాక్సిన్‌ను అధిక మోతాదులో ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కోవ్యాక్సిన్‌ను తయారు చేయడానికి తయారీ దారులు ముందుకు వస్తే, వారికి టెక్నాలిజీని బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి నడుం బిగించి, ముందుకు వస్తే ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వారికి అనుమతులు మంజూరు చేయాలని సీఎం జగన్ తన లేఖలో ప్రధానిని కోరారు.













