ఇప్పటి నుంచి మా కోసం ఆలోచించండి: ముఖ్యమంత్రి
‘నా జీవితం అయిదు కోట్ల రాష్ట్ర ప్రజలకు అంకితం. రాత్రి పగలు పని చేస్తా. ఎంత సంక్షేమాన్ని అందిస్తే అంత ఆనందానికి గురవుతా. ఎప్పుడూ వ్యక్తిగత విలాసాలకు పోలేదు. ఇన్నాళ్లు 24 గంటలూ మీ గురించే ఆలోచించా. మీ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి నా కోసం.. పార్టీ కోసం మీరంతా ఆలోచించాలి. నిండు మనసుతో ఆశీర్వదించండి. సంక్షేమానికి తొలిసారిగా నాంది పలికింది ఎన్టీ రామారావు. పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేసిన మహానుభావుడు ఆయన. ఆ స్ఫూర్తిని తెదేపా భవిష్యత్తులోనూ కొనసాగిస్తుంది. నిత్యం పేదల కోసమే పనిచేస్తోంది…’ అని చంద్రబాబు పేర్కొన్నారు. జన్మభూమిలో భాగంగా ముందుగా వివిధ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులతో మాట్లాడారు. సామాజిక సాధికారత, సంక్షేమం-ప్రజాసంతృప్తి తదితర అంశాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆరోవిడత జన్మభూమికి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ ఫలాలు పొందారని, పథకాల అమలులో ఎక్కడ లోపాలున్నా నిర్మొహమాటంగా చెప్పొచ్చని సూచించారు.













