ఈ ఎన్నికల్లో ఏపీలో తామే గెలుస్తాం
కేంద్రంలో కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని రాబోతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో న్యూస్ ఎక్స్ ఆధ్వర్యంలో ఇండియా నెక్ట్స్-2019 మెగా కాన్క్లేవ్ లో అమరావతి నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తామే గెలుస్తామని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. సీబీఐ, ఈడీ, విజిలెన్స్ కమిషన్, ఆర్బీఐ తదితర సంస్థలన్నింటినీ మోదీ తన చెప్పుచేతుల్లో పెట్టుకుని.. ప్రత్యర్థులను వేధించేందుకు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి- దేశాన్ని కాపాడాలి నినాదంతో వివిధ రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయని అన్నారు. రాజకీయంగా కొన్ని విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత అందరం కలుస్తామని, ఎన్నికల తర్వాత అంతా కలిసి ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పారు.













