హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు సీఐడీ..! కేసులో మరింత స్పీడ్..!!
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ స్పీడ్ పెంచింది. ఈ అంశంపై ఇప్పటికే చంద్రబాబునాయుడు, నారాయణలకు నోటీసులు అందించింది. అయితే సీఐడీ నోటీసులపై వీళ్లిద్దరూ హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం 4 వారాలు స్టే ఇచ్చింది. అయితే ఈ స్టే పైన సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది సీఐడీ. ఇవాళో రేపో సుప్రీంకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేయనుంది. మరోవైపు స్టేపై క్లారిటీ వచ్చేలోపు మిగిలిన వ్యవహారాలను పూర్తి చేసే యోచనలో ఉంది సీఐడీ.
అమరావతి భూసమీకరణలో అసైన్డ్ భూముల వ్యవహారం నేక ఆరోపణలకు తావిస్తోంది. జీవో 41 తీసుకురావడం ద్వారా అసైన్డ్ భూములు కలిగిన దళితులకు అన్యాయం జరిగిందని.. దీని వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. అందుకే తాను వాళ్ల తరపున ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు. వాస్తవానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకే సీఐడీ ఈ కేసును చేపట్టి విచారణ వేగవంతం చేసింది.
చంద్రబాబు, నారాయణలకు నోటీసులు ఇవ్వడంతో పాటు అప్పటి సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ను కూడా విచారించింది సీఐడీ. భూసమీకరణలో అప్పుడు అవలంభించిన పద్ధతులను అడిగి తెలుసుకుంది. నిబంధనల ఉల్లంఘనలపై కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాక.. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో పలువురు దళిత రైతులను కూడా విచారించింది సీఐడీ. భూములు స్వచ్చంధంగానే ఇచ్చారా.. ఎవరైనా బలవంతపెట్టారా.. పరిహారం అందుతోందా.. లాంటి అంశాలను ఆరా తీసింది. అయితే తాము స్వచ్ఛందంగానే భూములిచ్చామని.. పరిహారం కూడా అందుతోందని రైతులు చెప్పినట్లు సమాచారం.
ఇప్పుడు సీఐడీ మరింత స్పీడ్ పెంచుతోంది. అసైన్డ్ భూములు కొన్నవారిని విచారించేందుకు సిద్ధమవుతోంది. నిబంధనలు ఉల్లంఘించి భూములు ఎలా కొన్నారు.. అసైన్డ్ భూములు కొనకూడదని తెలీదా.. లాంటి అంశాలపై వారి నుంచి వాంగ్మూలాలు సేకరించనుంది. అయితే జీవో 41 ద్వారా అసైన్డ్ భూముల లావాదేవీలకు ఆస్కారం ఏర్పడిందనే విషయాన్ని అటు అమ్మకందారులు, ఇటు కొనుగోలుదారులు లేవనెత్తుతున్నారు. మరి ఈ అంశం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.













