Amaravathi: అమరావతి పునర్నిర్మాణం: కార్మికుల కృషికి నివాళి..

అమరావతిలో (Amaravati) ప్రస్తుతం ఎటు చూసినా నిర్మాణ పనుల ధ్వని వినిపిస్తుంది. ఇది ఇప్పుడు నవ్యాంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) కి ఓ అభివృద్ధి చిహ్నంగా మారుతోంది. ఇటీవలి కాలంలో ప్రారంభమైన నిర్మాణాల్లో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొంటున్నారు. స్థానికులే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది కార్మికులు కూడా ఈ పనుల్లో భాగమవుతున్నారు. అమరావతి నిర్మాణం వారు జీవనాధారంగా చూస్తున్నారు. ఎంతోకాలంగా స్థిరమైన ఉపాధి కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు అమరావతిలో సంతృప్తిగా జీవిస్తున్నారు.
మే 1 కార్మిక దినోత్సవం (Labour Day) సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు తాము పొందుతున్న ఉపాధిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మహానగర నిర్మాణంలో భాగస్వాములవుతుండటం గర్వంగా భావిస్తుండగా, మరోవైపు తమ కడుపునింపే పని దొరకడం సంతోషాన్నిస్తుంది. చిన్న చిన్న పనులతో పోలిస్తే ఇటువంటి విస్తృత స్థాయిలో సాగే నిర్మాణ ప్రాజెక్టులు, కార్మికులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్నాయని వారు అంటున్నారు.
టీడీపీ (TDP ) హయాంలో అమరావతి అభివృద్ధి వేగంగా సాగింది. ఆ సమయంలో వేలాది కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవనం ప్రారంభించారు. అయితే 2019 లో ప్రభుత్వ మార్పు రావడంతో పనులు ఆగిపోయాయి. దీంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో ఆశలతో వచ్చిన వారు నిరాశతో తమ గ్రామాల బాట పట్టారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పాలనలో మార్పుతో పాటు అభివృద్ధి కూడా తిరిగి ఊపందుకుంది. అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభమవడంతో కార్మికుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. కొందరు కార్మికులు ఈ తరహా నిర్మాణాలు తాము పని చేసేందుకు ఒక గొప్ప అవకాశమని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పనితో నిండిన జీవితం తమకిచ్చిన ఆనందం వేరే అని అంటున్నారు.
ఈ రోజు మే డే (May Day) నేపథ్యంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేశ్‌లు (Minister Lokesh) కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మిక వర్గానికి మద్దతుగా ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శ్రమికులు, కర్షకులు కలిసి రాష్ట్ర అభివృద్ధికి బలమైన మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈవిధంగా అమరావతి (Amaravati) అభివృద్ధి ప్రయాణంలో కార్మికులు కీలక భాగంగా మారడం నిజంగా విశేషం.