Ap cabinet: వివేకా కేసులో ఏపీ కేబినేట్ సంచలన నిర్ణయం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి(Ys vivekananda reddy) హత్య కేసు విషయంలో మరోసారి సిబిఐ అధికారులు దృష్టిపెట్టే అవకాశం కనబడుతోంది. గత ఐదారేళ్లలో దాదాపు ఆరుగురు సాక్షులు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. ఇటీవల వైఎస్ అభిషేక్ రెడ్డి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా వాచ్మెన్ రంగన్న అనారోగ్యం కారణంగా మరణించారు. దీనిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఉన్న నిందితులు లేదంటే.. సాక్షులు ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఈ కేసులో సిబిఐ అధికారులు అప్పట్లో దృష్టిపెట్టినా.. ఈ మధ్యకాలంలో మళ్లీ ఈ కేసును పట్టించుకోలేదు.
ఈ తరుణంలో వరుసగా సాక్షులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై తాజాగా ఏపీ క్యాబినెట్ లో కూడా కీలక చర్చ జరిగింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు మరణించడాన్ని.. సీఎం చంద్రబాబు (chandrababu Naidu) సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని క్యాబినెట్ తీర్మానించింది. తాజాగా వాచ్మెన్ రంగన్న ప్రాణాలు కోల్పోవడాన్ని ఏపీ పోలీసులు కూడా సీరియస్ గానే తీసుకొని విచారిస్తున్నారు. అటు కుటుంబ సభ్యులు కూడా ఓ రంగన్న మరణం పై అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
అవసరమైతే ఈ కేసును సిబిఐ అధికారులకు అప్పగించే అవకాశం కనపడుతోంది. ఇక ఈ కేసులో నిందితులు అలాగే సాక్షులకు భద్రత పెంచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై ఆదేశాలు కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హోంశాఖ కీలక అధికారులు ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వైయస్ అభిషేక్ రెడ్డి మరణం పై కూడా సాంకేతిక ఆధారాలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.













