శాఖల కేటాయింపులో చంద్రబాబు జాగ్రత్తలు!
ఆంధ్రప్రదేశ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శాఖల కేటాయింపు పూర్తయింది. సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. మూడు పార్టీల కూటమి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించడంతో ఎవరెవరికి మంత్రిపదవులు దక్కుతాయి.. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు.. ప్రాధాన్య శాఖలపై జగడాలు తప్పవేమో.. లాంటి అనేక అనుమానాలు, సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే చంద్రబాబు మంత్రులకు శాఖల కేటాయింపు చూసిన తర్వాత అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
చంద్రబాబు తన కేబినెట్లోకి 24 మందిని తీసుకున్నారు. ఇందులో జనసేనకు చెందిన ముగ్గురిని, బీజేపీ నుంచి ఒకరిని మంత్రివర్గంలో బాధ్యతలు అప్పగించారు. అయితే వీళ్లకు ఏశాఖలు కేటాయిస్తారనే ఆసక్తి మొదలైంది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కేబినెట్లో ఉండడంతో ముఖ్యమంత్రికి ఏమాత్రం తగ్గని స్థాయిలో అతనికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం కట్టబెట్టారు చంద్రబాబు. అంతేకాక.. కీలక మైన ఐదు శాఖలను పవన్ కల్యాణ్ కు కేటాయించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి ప్రధాన శాఖలను పవన్ కు అప్పగించారు.
జనసేనకు చెందిన మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌరసరఫరాల శాఖ కేటాయించారు. మరో జనసేన మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటకంతో పాటు సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలను ఇచ్చారు. బీజేపీ నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఏకైక నేత సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంతో పాటు వైద్య విద్యను కేటాయించారు. ప్రధాన శాఖలను మిత్రపక్షాలకు ఇవ్వడం ద్వారా పొత్తు ధర్మాన్ని చంద్రబాబు గౌరవించినట్లయింది. తద్వారా మిత్రపక్షాల నుంచి అసంతృప్తులు లేకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు.
ఇక టీడీపీకి మంత్రులకు కూడా మంచి శాఖలు దక్కాయి. అనుభవం, సామాజీక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని శాఖలను కేటాయించినట్లు అర్థమవుతోంది. నారా లోకేశ్ కు ఏ శాఖ దక్కుతుందని అందరూ ఆసక్తిగా ఎదుర చూశారు. ఆయనకు విద్యాశాఖతో పాటు ఐటీ, ఆర్టీజీ శాఖలు దక్కాయి. కీలకమైన హోంశాఖను పార్టీ ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనితకు కట్టబెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా హోంశాఖను మహిళలే నిర్వహించారు. ఇప్పుడు కూడా అది మహిళలకే దక్కింది. సీనియర్ నేత అచ్చెన్నయాడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలు దక్కాయి. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్, పొంగూరు నారాయణనకు గతంలో నిర్వహించిన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలే కట్టబెట్టారు.
సీనియర్ నేత నిమ్మల రామానాయుడుకు కీలకమైన జలవనరుల అభివృద్ధి, ఎన్ఎండీ ఫరూక్ కు మైనార్టీ సంక్షేమంతో పాటు న్యాయశాఖ, ఆనం రామనారాయణరెడ్డికి దేవదాయ శాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు కేటాయించారు. అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, కొలుసు పార్థసారథికి గృహనిర్మాణం, సమాచార శాఖ.. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ, గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ, గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ జనార్ధన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి, ఎస్.సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలు, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు, కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ ఐ వ్యవహారాలు, మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖ దక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సాధారణ పరిపాలన, శాంతిభద్రతల శాఖలతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. మొత్తంగా శాఖల కేటాయింపులో చంద్రబాబు అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టు అర్థమవుతోంది.













