Cabinet Expansion : చంద్రబాబు వేటు వేయబోతున్న నలుగురు మంత్రులెవరు?
ఆంధ్రప్రదేశ్ (AP) లో చంద్రబాబు (Chandrababu) అధికారంలోకి వచ్చి ఆరు నెలలు మాత్రమే అయింది. అప్పుడే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ (Cabinet reshuffle) జరుగుతుందంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోదరుడు నాగబాబును (Nagababu) మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు చంద్రబాబు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీంతో కేబినెట్ విస్తరణ ఖాయమని అర్థమైంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీ ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారని మొదట భావించారు. అయితే ఇప్పుడు విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించే దిశగా పునర్వ్యవస్థీకరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబు తాజా కేబినెట్ సమావేశంలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. కొంతమంది మంత్రుల పనితీరు మరీ నాసిరకంగా ఉందని.. ఏమాత్రం ప్రభావవంతంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మాత్రమే కాకుండా పలు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత నలుగురు మంత్రులను తప్పించేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు తప్పించాలనుకుంటున్న మంత్రుల్లో మొదట వినిపిస్తున్న పేరు కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas). ఈయన ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీన్ని టీడీపీ హైకమాండ్ తో పాటు పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బొత్స సత్యనారాయణ కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ఆయన్ను తప్పించే అవకాశాలున్నాయనే టాక్ బలంగా వినపిస్తోంది.
ఇక రెండో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy). యువకుడు కావడం, రాయచోటిలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి వరుస విజయాలకు బ్రేక్ వేయడంతో రామ్ ప్రసాద్ రెడ్డికి కేబినెట్లో అవకాశం కల్పించారు. అయితే అతని పేషీ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని తెలుస్తోంది. కొంతమంది వైసీపీ నేతలు ఇప్పటికీ ఆయన పేషీలో చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఏసీబీ కూడా త్వరలో కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ చెడ్డపేరు తెచ్చుకున్న మంత్రుల్లో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముందున్నారు.
ఇక మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయని భావిస్తున్న వారిలో మూడో వ్యక్తి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathi). ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంతోమంది టీడీపీ సీనియర్ నేతలున్నా వాళ్లందరినీ కాదని వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే ఇటీవల ఆయన జోగి రమేశ్ తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం పలు విమర్శలకు తావిచ్చింది. అంతేకాక.. తన పరిధిలోని పనులను పార్థసారథి ఇప్పటికీ వైసీపీ నేతలకే ఇస్తున్నారని.. టీడీపీ వాళ్లను దగ్గరకు రానివ్వట్లేదని విమర్శలున్నాయి. దీంతో పార్థసారథిపై అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందాయి.
చివరగా కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని భావిస్తున్న వాళ్లలో వాసంశెట్టి సుభాష్ (Vasamsetty Subhash) కూడా ఉన్నారు. ఈయన్ను తప్పించేందుకు పెద్దగా కారణాలు లేకపోయినా పనితీరులో అనుకున్నంత వేగం లేకపోవడం, కేడర్ ను కలుపుకుపోవడంలో విఫలమవుతుండడం సమస్యలుగా మారాయి. ముఖ్యంగా జిల్లా నేతలంతా మూకుమ్మడిగా వాసంశెట్టిపై అసంతృప్తితో ఉన్నారు.
అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. కేవలం ఆరు నెలల్లోనే మంత్రివర్గంలో కొందరిని తప్పిస్తే అది తప్పుడు సంకేతాలివ్వడం ఖాయం. కాబట్టి మంత్రివర్గం నుంచి ఎవర్నీ తప్పించకపోవచ్చు. కొత్తగా నాగబాబును మాత్రమే చేర్చుకునే అవకాశం ఉంది.













