ఊహకందని చంద్రబాబు కేబినెట్.. మంత్రివర్గ కూర్పులో అనేక సంచలనాలు!
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. చంద్రబాబు ఇవాళ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రధాని సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఈ కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది. చంద్రబాబు కేబినెట్లో ఎవరెవరికి ప్రాతినిధ్యం దక్కుతుందనే అంశంపై ఫలితాలు వెలువడినప్పటి నుంచి జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఎంతోమంది సీనియర్లు గెలుపొందడం, రేసులో ఎంతోమంది పోటీలో ఉండడంతో చంద్రబాబుకు మంత్రివర్గ కూర్పు కత్తిమీద సాములా మారింది. అయితే ఎవరి అంచనాలకు అందని విధంగా మంత్రివర్గాన్ని నియమించుకుంటున్నారు చంద్రబాబు.
చంద్రబాబు తన కేబినెట్లోకి 24మందిని తీసుకుంటున్నారు. ఒక స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు. 24 మందిలో ముగ్గురు జనసేన వాళ్లు కాగా ఒకరు బీజేపీకి చెందిన వారు. మిగిలిన 20మంది టీడీపీ తరపున గెలిచిన వారే. మొత్తం 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. వీళ్లలో 10 మంది తొలిసారి శాసన సభలో అడుగుపెట్టిన వారుండడం విశేషం. ఆరుగురు మాత్రమే గతంలో మంత్రులుగా పని చేశారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కు స్థానం దక్కింది. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్ కు మాత్రమో చోటు లభించింది. రెడ్లు, కమ్మలు, కాపులు, ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు స్థానం దక్కింది. క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఏడుగురు గెలిచినా ఒక్కరికీ చోటు దక్కలేదు.
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో 8మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన 8 మంది మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. వీళ్లలో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. వీళ్లంతా తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలే. ఇక పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినా మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేశారు.
పలువురు సీనియర్లకు ఈసారి కేబినెట్లో చోటు దక్కలేదు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, కళా వెంకట్రావు, కూన రవికుమారు, గంటా శ్రీనివాసరావు, విష్ణు కుమార్ రాజు, రఘురామకృష్ణం రాజు, బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, చింతమనేని ప్రభాకర్, బొండా ఉమా మహేశ్వర రావు, కొలికిపూడి శ్రీనివాస్, మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్ రావు, కన్నా లక్ష్మినారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనంద్, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, మాధవి రెడ్డి, పరిటాల సునీత లాంటి ఎంతోమంది మంత్రివర్గలో చోటు ఆశించారు. కానీ వీళ్లెవరికీ అదృష్టం వరించలేదు.
చంద్రబాబు కేబినెట్
1. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
2. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
3. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు
4. శ్రీ కొల్లు రవీంద్ర గారు
5. శ్రీ నాదెండ్ల మనోహర్
6. శ్రీ పి.నారాయణ గారు
7. శ్రీమతి వంగలపూడి అనిత గారు
8. శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు
9. శ్రీ నిమ్మల రామానాయుడు గారు
10. శ్రీ ఎన్.ఎమ్.డి.ఫరూక్ గారు
11. శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు
12. శ్రీ పయ్యావుల కేశవ్ గారు
13. శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు
14. శ్రీ కొలుసు పార్థసారధి గారు
15. శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి గారు
16. శ్రీ గొట్టిపాటి రవి గారు
17. శ్రీ కందుల దుర్గేష్ గారు
18. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు
19. శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు
20. శ్రీ టీజీ భరత్ గారు
21. శ్రీమతి ఎస్.సవిత గారు
22. శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు
23. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు
24. శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు
25. శ్రీ నారా లోకేష్ గారు
మంత్రివర్గం సామాజిక సమీకరణాలు..
ఎస్సీ మాల – డోలా బాల వీరాంజనేయ స్వామి.
ఎస్సీ మాదిగ – అనిత
ఎస్టీ – గుమ్మడి సంధ్యారాణి
ముస్లిం మైనారిటీ – ఫరూక్
ఆర్య వైశ్య – టీజీ భరత్
రెడ్డి – ఆనం, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కాపు- నిమ్మల, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్
బలిజ – నారాయణ
కమ్మ – నారా లోకేష్, నాదెండ్ల (జనసేన), పయ్యావుల, గొట్టిపాటి రవి
బీసీ, యాదవ – పార్థసారథి, సత్యకుమార్ (బీజేపీ)
బీసీ మత్స్యకార – కొల్లు రవీంద్ర
బీసీ తూర్పు కాపు – కే శ్రీనివాస్
బీసీ, కొప్పుల వెలమ – అచ్చెన్నాయుడు
బీసీ, గౌడ – అనగాని సత్యప్రసాద్
బీసీ, శెట్టిబలిజ – వాసంశెట్టి సుభాష్
కురబ – సవిత













