Chandrababu: జీఎస్టీ-2.0 కు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ మద్దతు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ స్లాబ్ మార్పులను అధికారపక్షం మాత్రమే కాకుండా మొత్తం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మొత్తం మద్దతు పలికింది. దీంతో జీఎస్టీ-2.0 సంస్కరణలను ఆమోదిస్తూ తీర్మానం చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఈ మార్పుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ను కూడా అభినందించింది.
సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, గతంలో ఉన్న పన్ను విధానం ఎంత క్లిష్టంగా ఉండేదో గుర్తుచేశారు. సీఎస్టీ, వ్యాట్‌తో పాటు 17 రకాల పన్నులు, 13 రకాల సెస్సులు, సర్‌ఛార్జీలు ఉండేవని తెలిపారు. ఒక ఉత్పత్తి నుంచి మరో అనుబంధ ఉత్పత్తి వస్తే కూడా పన్నులు వేసే పరిస్థితి ఉండేదని ఆయన చెప్పారు. ఇప్పుడు కొత్త జీఎస్టీ సవరణలతో రెండు స్లాబుల విధానం తీసుకొచ్చారని, దాంతో పన్ను చెల్లింపులు సులభమయ్యాయని తెలిపారు.
ఈ సంస్కరణలతో ప్రభుత్వం ఆదాయం పెంచుకోగలదని, అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమం బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. నెక్స్ జెన్ జీఎస్టీ దేశానికి నిజమైన గేమ్‌చేంజర్ అవుతుందని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించే వారికి మాత్రమే సంక్షేమం చేసే సామర్థ్యం ఉంటుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయంతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన లాభం కలుగుతుందని వివరించారు.
చంద్రబాబు వివరించిన ప్రకారం, 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. సబ్బు, టూత్‌పేస్ట్, షాంపూ, నెయ్యి వంటి అవసర వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పారు. అలాగే ఫ్రిజ్, ఎయిర్ కండీషనర్ వంటి గృహోపకరణాలు కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. జీవిత భీమా, ఆరోగ్య బీమాలకు జీఎస్టీ పూర్తిగా మినహాయించబడిందని, దాంతో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
రైతుల కోసం అగ్రిటెక్ యంత్రాలపై పన్నులు తగ్గించడం ముఖ్యమైన నిర్ణయం అని పేర్కొన్నారు. అలాగే గృహ నిర్మాణ సామగ్రి ధరలు తగ్గుతాయని, నిర్మాణ రంగం పుంజుకోవడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. రాష్ట్రానికి యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా సుమారు రూ.750 కోట్లు ఆదా అవుతుందని చంద్రబాబు వెల్లడించారు.
జీఎస్టీ వసూళ్లు 22 లక్షల కోట్లకు చేరుకున్నాయని, పన్ను చెల్లింపు దారుల సంఖ్య 1.51 కోట్లకు పెరిగిందని ఆయన గర్వంగా చెప్పారు. “వన్ నేషన్ – వన్ ట్యాక్స్” విధానం సక్రమంగా అమలవుతుండటం వల్లే ఈ ప్రయోజనాలు వస్తున్నాయని అన్నారు. ఈ సంస్కరణలు భారత్‌ను డబుల్ డిజిట్ వృద్ధి సాధించే దేశంగా నిలబెడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఈ ప్రయోజనాలు చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.