ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 7 వేల 943 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. గడచిన 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను సేకరించామని, 7,943 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కాగా 93 మంది కోవిడ్‌తో మరణించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,461 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, 6,323 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సోమవారం 591 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించామని, గతంలో పోలిస్తే ఆక్సిజన్ వినియోగం బాగా తగ్గిందని, 104 కాల్ సెంటర్‌కు వచ్చే కాల్స్ కూడా తగ్గాయని సింఘాల్ వెల్లడించారు.
ఒకేసారి 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే ప్రథమమని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారని, దాని ప్రకారమే జరుగుతోందని తెలిపారు. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూను జూన్ 10 వరకూ పొడిగించామని, ప్రస్తుతం కొనసాగుతున్న సడలింపులే వర్తిస్తాయని అశోక్ సింఘాల్ స్పష్టం చేశారు.