12 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఏపీ సీఎం జగన్… ఆనందంలో డీఎస్సీ అభ్యర్థులు

దాదాపు 12 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఊపిరిపోసే వార్తను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వారందర్నీ మినిమమ్ టైమ్ స్కేల్‌తో ఎస్జీటీలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 2,193 మంది అభ్యర్థులకు ఈ నిర్ణయం ద్వారా మేలు కలగబోతోంది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. 12 ఏళ్లుగా ఆ అభ్యర్థులందరూ ఎంతో నిరీక్షిస్తున్నారని, వారందరి డిమాండ్లను, విన్నపాలను విన్న తర్వాత సీఎం జగన్ వారికి తగు న్యాయం చేశారని మంత్రి వెల్లడించారు. దీనిపై అతి త్వరలోనే జీవో కూడా విడుదల చేస్తామని తెలిపారు. మానవతా దృక్పథంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 2018 డీఎస్సీ అభ్యర్థులకు కూడా ఇదే విధమైన న్యాయం చేస్తున్నామని మంత్రి తెలిపారు. 2018 డీఎస్సీలో నోటిఫై చేసిన 7,042 పోస్టులకు గాను, 6,361 పోస్టులను భర్తీ చేసి, అపాయింట్‌మెంట్లు కూడా ఇచ్చామని వివరించారు. 374 పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 50 వేల పైచిలుకు పోస్టులకు మెగా డీఎస్సీ నిర్వహించారు. అయితే నియామకాల్లో కొందరు అవకాశాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన విషయం కొన్ని ఏళ్లుగా, కోర్టుల్లో, ట్రైబ్యునల్‌లోనూ విచారణ జరుగుతూ వస్తోంది.