ప్రధాని మోదీ, నిర్మలమ్మకు థ్యాంక్స్ : చంద్రబాబు
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఏపీ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందించారు. ఏపీ మళ్లీ గాడిలో పడుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేలా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు.













