ప్రపంచ పర్యాటక కేంద్రంగా అహోబిలం
వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన అహోబిలం క్షేత్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ అన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం క్షేత్రాన్ని ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. అనంతరం మాలోల అతిధి గృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ అహోబిల శ్రీ లక్ష్మీనరసింహస్వామి తమ ఇలవేల్పు అన్నారు. ఈరోజు స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నల్లమలలో నవనారసింహ క్షేత్రాలు వుండడం విశేషమన్నారు. ఎంతో ఆహ్లాదకర వాతావరణం కలిగివుండడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం, అహోబిలం, తిరుమలను ఒకే సారి భక్తులు దర్శించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.













