పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు సినిమా..! పరిశీలనలో పలు టైటిల్స్..!!
పవన్ కల్యాణ్ ఇటీవల నటించిన సినిమా బ్రో. సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా నటుడు పృథ్వీరాజ్ పోషించిన శ్యాంబాబు పాత్ర మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందంటూ జనం చర్చించుకుంటున్నారు. సినిమాలో పృథ్వీ వేసిన డ్యాన్స్ గతంలో రాంబాబు వేసిన డ్యాన్స్ ను పోలి ఉందని.. రాంబాబును ఉద్దేశించే ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశారని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో పృథ్వీ కూడా దీనిపై స్పందించారు. అంబటి రాంబాబు ఎవరో తెలీదని.. ఆయన్ను గుర్తు పెట్టుకునేందుకు ఆస్కార్ నటుడేమీ కాదని ఎద్దేవా చేశారు. అంతేకాక.. బార్ లో నిత్యం తాగి తూలుతుంటే ఒక వెధవ క్యారెక్టర్ ను చేయాలని డైరెక్టర్ చెప్పారని.. అదే చేశానని పృథ్వీ చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడు హాట్ ఇష్యూగా మారింది.
బ్రో సినిమాలో తనను పోలిన పాత్రపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆ క్యారెక్టర్ తనను ఉద్దేశించే క్రియేట్ చేసినట్లు తనకు అనిపిస్తోందన్నారు. బ్రో సినిమా ఫ్లాప్ అయిందని.. తనను అడ్డం పెట్టుకుని కలెక్షన్లు రాబట్టుకునేందుకు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాంబాబు విమర్శించారు. కావాలనే తనను కించపరిచేందుకు త్రివిక్రమ్, పవన్ కలిసి స్క్రిప్ట్ రాశారన్నారు. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు నిర్మాత విశ్వప్రసాద్ ఆలోచించి ఉండాల్సిందన్నారు. విశ్వ ప్రసాద్ ద్వారా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ కు ప్యాకేజ్ సొమ్మును అందజేస్తున్నారన్నారు అంబటి రాంబాబు. అయినా పవన్ కల్యాణ్ సినిమాలు ఆడే పరిస్థితి లేదన్నారాయన.
సినిమాలు, రాజకీయం రెండూ చేయాలనుకుంటే కుదరవన్నారు అంబటి రాంబాబు. గతంలో ఎన్టీఆర్ లాంటి మహానటుడు రాజకీయాల్లోకి వెళ్లాక ఒకటిరెండు సినిమాలు మించి చేయలేదన్నారు. చిరంజీవి కూడా పాలిటిక్స్ లో ఉన్నంతకాలం సినిమాల జోలికి వెళ్లలేదన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం సినిమాలు, రాజకీయాలు రెండూ చేస్తున్నారని దుయ్యబట్టారు. వారాహి లాంటి పవిత్ర పేరును వాహనానికి పెట్టుకుని దాన్ని ఎక్కి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అందుకే ఆయన సినిమాలు ఆడట్లేదని ఆరోపించారు అంబటి రాంబాబు.
అయితే సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు చేసే ఓ వ్యక్తిని ఉద్దేశిస్తూ తాము కూడా ఒక సినిమా తీస్తున్నామన్నారు అంబటి రాంబాబు. దానికోసం పలు పేర్లు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. నిత్య పెళ్లికొడుకు, బహుభార్యా ప్రావీణ్యుడు, పెళ్లిళ్లు పెటాకులు, తాళి – ఎగతాళి, మూడు ముళ్లు – ఆరు పెళ్లిళ్లు, బ్రో లాగా మ్రో .. అంటే మ్యారెజెస్, రిలేషన్స్, అఫెండర్స్.. అనే టైటిల్స్ ఆలోచిస్తున్నామన్నారు. చివరగా అంబటి రాంబాబు సినిమా రచయితలకు, దర్శకులకు ఓ హెచ్చరిక చేశారు. మళ్లీ మళ్లీ ఇలాంటి సన్నివేశాలు తీస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దీన్ని అర్థం చేసుకోవాలని ఓ రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నా.. అన్నారు అంబటి.













