ఆయన పోరాట స్ఫూర్తి తెలుగుజాతికి ఆదర్శం : చంద్రబాబు
ఆనాడు స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలకుల గుండెల్లో అల్లూరి సీతారామారాజు నిద్రపోయారని, ఆయన పేరు వింటేనే వారు బెంబేలెత్తిపోయేవారని అలాంటి వ్యక్తి స్ఫూర్తిని, పోరాట పటిమను తెలుగు జాతి ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు 120వ జయంతి సందర్భంగా విజయవాడ బుడమేరు వంతెన కూడలిలో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అల్లూరి పేరు వినగానే ప్రతి ఒక్కరిలో ఆవేశం, పట్టుదల, కార్యదక్షత, దేశ భక్తి ఉప్పొంగుతుందన్నారు. కేవలం 27 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించినా దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశరన్నారు. దేశమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించేందుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. స్వాతంత్ర సంగ్రామంలో అడుగడుగునా బ్రిటీష్వారి గుండెల్లో నిద్రపోయి తెలుగువారి సత్తాని ప్రపంచానికి రుచిచూపించారని శ్లాఘించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తనవంతు కృషి చేస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాలలోని ప్రజలు మిగిలిన వారితో సమానంగా పైకి తీసుకువచ్చేంత వరకు తమ ప్రభుత్వం చేయూతను అందిస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం బోర్లు ఏర్పాటు చేసిందని ఆ నీటినే తాగాలని అన్నారు. రానున్న రోజుల్లో అరకు ప్రాంతాన్ని హెల్త్ టూరిజంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.













