వైసీపీకి భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం..
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి కాస్త కన్ఫ్యూజన్లో ఉంది. టీడీపీ అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత జగన్ పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్ది ఈ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కొద్దిరోజుల క్రితం వైసీపీ ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యేలు అయినా కిలారి రోశయ్య, మద్దాలి గిరి, రావెల కిషోర్ బాబు, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు పైల నరసింహయ్య వైసీపీ కు రాజీనామా చేశారు.
ఈ షాక్ నుంచి పార్టీ కోలుకోకముందే ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరొక కీల నేత రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు అయిన ఆళ్ల నాని పార్టీకి తన రాజీనామాను ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కూడా పంపించారు. ప్రస్తుతం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి పదవితోపాటుగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కూడా వదులుకుంటున్నట్లు ఆళ్ల నాని స్పష్టం చేశారు.
2019 ఎన్నికల అనంతరం మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఆళ్ల నానికి డిప్యూటీ సీఎం గా పదవి దక్కింది. అంతేకాకుండా ఆయన ఖాతాలోకి వైద్య మరియు ఆరోగ్య శాఖ వచ్చింది. కోవిడ్ సమయంలో నాని ఎంతో కష్టపడి పనిచేశారు. కానీ రెండవ విడత మంత్రి వర్గ విస్తరణలో జగన్ ఆ పదవిని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొట్టు సత్యనారాయణ కు ఇచ్చారు. అప్పటినుంచి ఆళ్ల నాని చాలా అసంతృప్తితో ఉన్నారు అని వార్తలు వచ్చాయి..
గతంలో పవన్, చంద్రబాబు, లోకేష్ పై ఆళ్ళ నాని ఎన్నో విమర్శలు చేశారు. కానీ మిగిలిన వైసీపీ నేతలు లాగా కాకుండా కాస్త డీసెంట్ గా ఉన్న భాషని ఉపయోగించేవారు. మంత్రి పదవి పోయిన తర్వాత క్రమంగా ఆళ్ల నాని వార్తల్లో కనిపించడం కూడా మానేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఏలూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి మొదట నాని ఆసక్తి చూపించినప్పటికీ జగన్ ఆయన్ను ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించారు.టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ చేతిలో ఆళ్ల నాని ఓడిపోయారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆళ్ళ నాని చెబుతున్నప్పటికీ ఆయన మనసులో ఇవన్నీ పెట్టుకునే ఇలా ప్రవర్తిస్తున్నారని చాలామంది భావిస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు అన్న విషయంపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి.













