పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం : ఆదిమూలపు సురేశ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా ఈ రాష్ట్రానికి గుదిబండలా తయారయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ ఎవరి కోసం పోరాడుతున్నారు ఏ అజెండాతో ముందుకెళ్తున్నారు. ఈ విషయాలపై ఆయనే క్లారిటీ తెచ్చుకోవాలన్నారు. ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కులాల మధ్య చిచ్చు పెట్టడం తగదన్నారు. రాజకీయంగా ఎదగాలంటే ఇది పద్ధతి కాదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఎన్నికలు వస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలనే ధోరణితో పవన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఆన్లైన్ టికెటింగ్ విధానంపై ఆయన మాట్లాడిన తీరు సినీపరిశ్రమ వారికే నచ్చలేదన్నారు. సినీ పరిశ్రమ బాగుపడుతుందనే కారణంగానే ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని కోరుకున్నాం అని స్వయంగా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలే చెబుతున్నారు. వారంతా ఒక క్లారిటీతో ఉంటే పవన్ మధ్యలో వెళ్లి రాజకీయం జోడిరచి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పవన్ మాట్లాడుతున్న భాష, ఆలోచనా విధానం చాలా ప్రమాదకరంగా ఉంది. రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందన్నారు.













