మళ్లీ ఆయనకే మరోసారి అవకాశం ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోవద్దంటే చంద్రబాబుకే మరోసారి అవకాశమివ్వాలని సినీ హీరో సుమన్ పిలుపునిచ్చారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు ఖాళీగా కూర్చోలేదని, ఆయన సీఎంగా ఉండడం వల్లే రాష్ట్రంలో ఈ మాత్రమైనా అభివృద్ధి జరుగుతోందన్నారు. చంద్రబాబుకు ఉన్న పాలన అనుభవంతో ఏపీని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ అడిగినవన్నీ ఎవరూ చేయలేరని, అయితే ఆయనలా ప్రశ్నించేవాళ్లు రాజకీయాల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని, భవిష్యత్తులో మంచి నాయకుడవుతాడని అన్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీ అధికారంలోకి రావడానికి పవన్ కూడా కారణమన్నారు.
కేసీఆర్ ఆదేశిస్తే తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీకి దిగుతానని అన్నారు. తెలంగాణ ఉద్యమ జరిగిన సమయంలో సినిమా పరిశ్రమ నుంచి జై తెలంగాణ నినాదం చేసిన మొదటి వ్యక్తిని తానే అని చెప్పారు. టీఆర్ఎస్, కేసీఆర్కు తన సంపూర్ణ మద్దతునిస్తానన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి టీడీపీ తరపున తాను పోటీ చేయబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ప్రస్తుతానికి దృష్టంతా తెలంగాణపైనే కేంద్రీకరించానని, ఆంధ్ర రాజకీయాల గురించి ఆలోచించడం లేదన్నారు.













