ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు : అచ్చెన్న
కనీస ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేసు పెట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణితో పాటు అచ్చెన్నాయుడు, ప్రతిపాటి పుల్లారావు ములాఖత్ ద్వారా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారన్నారు. ఏదైనా కేసు పెట్టాలంటే కనీస ఆధారాలు ఉండాలి. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. చంద్రబాబును రెండ్రోజులపాటు ప్రశ్నించారు. ఏమైనా ఆధారాలు దొరికాయా? అంటే సమాధానం లేదు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిపై కేసు పెట్టారు. ప్రజా శ్రేయస్సు కోసం ఆయన రూ.లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు. అలాంటి వ్యక్తి రూ.330 కోట్ల అవినీతి చేశారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ యువత రోడ్డెక్కింది. ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసులు చూస్తున్నారు అని మండిపడ్డారు.













