స్వరాజ్యమైదానంలో 4వ రాష్ట్రస్థాయి ఉద్యానవన ప్రదర్శన
పూల సొగసు మనసుకు తెలుసు
దేవుడికి అర్పించాలన్నా..ప్రకృతిని ఆస్వాదించాలన్న పూల అలంకరణ , గుభాళిింపు తప్పనిసరి …
పరువాల పడుచు నుంచి పండు ముదసలి వరకూ పూలకు గులాం కావాల్సిందే…
విజయవాడ రావయా …పూల అందాలు చూడవయా..
ఉద్యానవన, గులాబీల ప్రదర్శనలో సందడి
కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మొక్కలు పెంచాలి
రాజధాని అమరావతిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్వరాజ్యమైదానంలో హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ, రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ నగరపాలకసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 4వ రాష్ట్రస్థాయి ఉద్యానవన ప్రదర్శన, 3వ రోజ్ షోను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో నగరాల్లో కాలుష్యం పెరుగుతోందన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మొక్కలు పెంచాలని పిలుపు ఇచ్చారు.
మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనల నిర్వహణకు స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరామని ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ చక్కని గులాబీల ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. విజయవాడ నగరంలో మరిన్ని ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా పుష్పప్రదర్శనలో విద్యార్థులకు పువ్వులతో రంగోలి పోటీలను నిర్వహించారు. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్, అమరావతి బోన్సాయ్ సొసైటీ, గార్డెన్ స్టూడియోస్ ఏర్పాటు చేసిన బోన్సాయ్ మొక్కలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.













