తెరుచుకున్న కేథార్నాథ్ ఆలయం
ఆరునెలల పాటు మూసివున్న కేథార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులను వేద పండితులు తెరిచారు. ఇవాళ ఉదయం సరిగ్గా 6 గంటల 10 నిముషాలకు ఆలయం తలుపులు ఓపెన్ చేశారు. అంతకుముందు పవిత్ర పంచముఖి డోలి యాత్ర జరిగింది. ఉత్తరాఖండ్ లోని గడ్డస్థల్ వద్ద ప్రారంభైన యాత్ర.. గౌరీకుండ్ వరకు వాహనంలో సాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కాలినడకన కేదారనాథున్ని డోలీ యాత్ర ద్వారా ఆలయానికి తీసుకువచ్చారు. ఏటా దాదాపు కుమావో బెటాలియన్ ఆర్మీ నేతృత్వంలో యాత్ర జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై శివనామస్మరణతో గిరులను మారుమోగిస్తారు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా భక్తులు ఎక్కడికీ కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో కేవలం ఐదుగురు పూజారులు మాత్రమే డోలీ యాత్రలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆలయానికి భక్తులు ఎప్పుడు అనుమతిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఆలయ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా మళ్లీ ఆలయాన్ని నవంబర్లో మూసివేస్తారు.













