రాహుల్ గాంధీ కోసం ఇల్లు, షాపులు అమ్మకం!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణం సురక్షితంగా ఉండాలనేది తమ లక్ష్యమని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కర్ణాటకలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం హుబ్లీలో దిగడానికి ముందు ఒక వైపు భారీగా వంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి రాహుల్ క్షేమంగానే బయటపడ్డారు. అయితే ఇక నుంచి రాహుల్ ప్రయాణించే విమానం సురక్షితంగా ఉండాలని, ఆయనకు కొత్త విమానం కొనేందుకు కాంగ్రెస్ నాయకుడు అశోక్ జైశ్వాల్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొత్త విమానం కొనేందుకు తన ఇంటిని, షాపులను అమ్మకానికి పెట్టారు. ఈ యాడ్‌ను పేపర్లో కూడా ఇచ్చారు. జైశ్వాల్ స్నేహితులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొత్త విమానానికి నిధులు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారానికి కంటే ముందే విమానం కొనుగోలు చేయాలని, దాంట్లోనే రాహుల్ ప్రచారం చేయాలని జైస్వాల్ చెబుతున్నారు.













