బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. అంతర్జాతీయ ప్రయాణికులను ఆకట్టుకోవడంలో భాగంగా బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ల్యాప్టాప్ల సదుపాయం కల్పించే యోచనలో సంస్థ ఉన్నది. గ్లోబల్ రూట్లలో సగానికి సగం సీట్లు ఖాళీగా దర్శనమిస్తుండటంతో ప్రీమియం ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ సీఎండీ ప్రదీప్ సింగ్ తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అంతర్జాతీయ సర్వీసులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, దీంతో ప్రత్యామ్నాయాలను వెతుకాల్సిన గత్యంతరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులకు అందిస్తున్న వీడియో స్క్రీన్లు పనిచేయకపోవడం వల్లనే ల్యాప్టాప్లు అందించాలనుకుంటున్నామన్న ఆయన దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.













