ముంబై పేలుళ్ల కేసులో దోషులకు శిక్ష ఖరారు
1993 నాటి ముంబయి పేలుళ్ల కేసులో ముంబయిలోని ప్రత్యేక టాడా న్యాయస్థానం దోషులకు నేడు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసుకు సంబంధించి జూన్‌లో రెండో విడత విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం అబూసలేం, ముస్తఫా దోసా, కరీముల్లాఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్‌ఖాన్, రియాజ్ సిద్దిఖీ, తాహిర్ మర్చంట్లను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. వీరిలో ముస్తఫా దోసా గుండెపోటుతో మరణించారు. దీంతో మిగతా ఐదుగురికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. వీరిలో తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్‌కు ఉరిశిక్ష విధించింది. గ్యాంగస్టర్ అబూసలేం, కరీముల్లాఖాన్‌కు జీవితఖైదుతో పాటు రూ.2లక్షల జరిమానా విధించింది. మరో దోషి రియాజ్ సిద్ధిఖీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.













