Aviva Baig: అవీవా బేగ్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..! ప్రియాంక కోడలికి ఎన్ని టాలెంట్‌లో!?
దేశమంతా ఇప్పుడు ఒకే విషయం గురించి చర్చించుకుంటోంది. అది గాంధీ కుటుంబంలో జరగబోయే పెళ్లి గురించి. ప్రియాంకా గాంధీ తనయుడు రేహాన్ వాద్రాను పెళ్లాడబోతున్న అమ్మాయి గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో విపరీతమైన సెర్చింగ్ జరుగుతోంది. ఆమె పేరు అవీవా బేగ్ (Aviva Baig). అయితే, ఆమెను కేవలం రేహాన్ వాద్రాకు కాబోయే భార్యగానో, గాంధీ కుటుంబపు కోడలిగానో మాత్రమే చూడలేం. క్రీడా మైదానం నుంచి కెమెరా లెన్స్ వరకు ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంది. మల్టీ-టాలెంటెడ్ ఉమెన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అవీవా బేగ్.
అవీవా బేగ్ ఒకప్పుడు క్రీడా మైదానంలో చురుకైన ప్లేయర్. ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న రోజుల్లోనే ఆమె క్రీడల్లో రాణించారు. అవీవాకు ఫుట్‌బాల్ అంటే ప్రాణం. పాఠశాల స్థాయిలో ఆమె జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. జట్టులో కీలక ప్లేయర్‌గా ఆమెకు మంచి పేరుంది. కేవలం ఫుట్‌బాల్‌కే పరిమితం కాకుండా, ఈత పోటీల్లోనూ ఆమె సత్తా చాటారు. క్రీడలు నేర్పిన క్రమశిక్షణ, పోరాట పటిమ ఆమె వ్యక్తిత్వంలో భాగమయ్యాయని ఆమె సన్నిహితులు చెబుతుంటారు.
క్రీడల నుంచి ఆమె దృష్టి మెల్లగా కళల వైపు మళ్లింది. ప్రపంచాన్ని తన కళ్లతో కాకుండా, కెమెరా కన్నుతో చూడటం అలవాటు చేసుకున్నారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మోడరన్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె, సోనిపట్‌లోని ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం, మీడియాలో డిగ్రీ పొందారు. ప్రస్తుతం అవీవా ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. సినిమాటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్ మీద ఆమెకు మంచి పట్టు ఉంది. కేవలం ఫోటోగ్రాఫర్గానే కాకుండా, వ్యాపారవేత్తగానూ ఆమె అడుగులు వేశారు. ‘అటెలియర్ 11’ అనే ప్రొడక్షన్, ఫోటోగ్రఫీ స్టూడియోకి ఆమె కో ఫౌండర్. ఈ సంస్థ ద్వారా పలు క్రియేటివ్ ప్రాజెక్ట్స్, డాక్యుమెంటరీలు, బ్రాండ్ షూట్స్ నిర్వహిస్తున్నారు.
అవీవా బేగ్ ది ఢిల్లీలో స్థిరపడిన ఒక విద్యావంతులైన, సంపన్న కుటుంబం. తండ్రి ఇమ్రాన్ బేగ్, ఒక ప్రముఖ వ్యాపారవేత్త. తల్లి నందితా బేగ్, సుప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్. అవీవాలోని కళాత్మక కోణం ఆమె తల్లి నుంచే వచ్చిందని చెప్పవచ్చు. అవీవా తల్లి నందితా బేగ్, ప్రియాంకా గాంధీకి అత్యంత ఆప్తురాలు. ఇందిరా గాంధీ మెమోరియల్ (ఇందిరా భవన్), రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కార్యాలయాల ఇంటీరియర్ డిజైనింగ్‌లో నందితా బేగ్ కీలక పాత్ర పోషించారు. ప్రియాంకా గాంధీతో కలిసి పనిచేశారు. ఈ వృత్తిపరమైన సాన్నిహిత్యమే రెండు కుటుంబాల మధ్య స్నేహానికి పునాది వేసింది.
రాజకీయ కుటుంబంలోకి వెళ్తున్నప్పటికీ, అవీవాకు రేహాన్‌తో ఉన్నది పొలిటికల్ బాండ్ కాదు.. ‘ఆర్టిస్టిక్ బాండ్’. రేహాన్ వాద్రా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఇష్టపడితే, అవీవా ఆర్టిస్టిక్ ఫోటోగ్రఫీని ఇష్టపడతారు. ఇద్దరూ కలిసి కెమెరాలు పట్టుకుని అడవులు, పర్వతాలు చుట్టేస్తుంటారు. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారు. ఆడంబరాల కంటే సింప్లిసిటీని ఇష్టపడే తత్వం అవీవాది.
అవీవా బేగ్.. ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మొదలై, మీడియా విద్యార్థిగా మారి, నేడు ఒక సక్సెస్ఫుల్ విజువల్ ఆర్టిస్ట్, ఆంట్రప్రెన్యూర్‌గా రాణిస్తున్నారు. ఆమె కేవలం ఒక రాజకీయ వారసుడిని పెళ్లి చేసుకోవడం వల్ల వార్తల్లోకి రాలేదు.., తనకంటూ ఒక ప్రత్యేకమైన కెరీర్‌ను, వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న ఆధునిక యువతిగా ఆమె నేటి తరానికి ప్రతినిధి. గాంధీ కుటుంబంలోకి ఆమె రాక, ఆ ఇంటికి కొత్త కళను తీసుకురావడం ఖాయం.






