తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ఏమైంది…?
దేశంలో అత్యధికంగా సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటాయి. కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రం గత ఆరేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలుగు రాష్ట్రాల విషయంలో పెద్దగా కనికరం చూపించే ప్రయత్నం ఎక్కడా చేయడం లేదు. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో మాత్రం ముందుకు రాలేకపోతున్నారు.
టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు అసలు పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. తెలంగాణలో విభజన హామీలు విషయంలో సీఎం కేసీఆర్ కూడా పెద్దగా కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేయటం లేదు. ఇక టిఆర్ఎస్ పార్టీ ఎంపీలకు అసలు విభజన హామీలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. అసలు పార్లమెంట్ సమావేశాలను ఎవరు వెళ్తున్నారు ఎవరూ వెళ్లడం లేదో కూడా అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్లో కూడా పెద్దగా నిధులు కేటాయించిన పరిస్థితి లేదని చెప్పాలి.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులు గురించి మాట్లాడిన పరిస్థితి కనపడటం లేదు. అయినా సరే టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా వాటి గురించి ఎక్కడా ప్రస్తావించ ప్రయత్నం చేయడం లేదని చెప్పాలి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై రాజకీయ విమర్శలు చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ నేతలు పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి తేలిపోతున్నారు. దీని కారణంగా ప్రజలు ఆ పార్టీ చులకన అవుతుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు అసలు కనపడే ప్రయత్నం కూడా చేయడం లేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో హాజరవుతున్న వాళ్ళ మధ్య సమన్వయం అనేది ఎక్కడా కనబడటం లేదు. ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రులతో స్నేహం చేయాలని చెప్పినా సరే వైసిపి ఎంపీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు అనే భావన ఉంది. తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు అలాగే విభజన హామీలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేక హోదా కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సి ఉంది.
2019 ఎన్నికలకు ముందు ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు మాత్రం ఈ విషయంలో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఇక ఎంపీలు కూడా పెద్దగా పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడకపోవటంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు అయితే ఢిల్లీ నుంచి కూడా వచ్చేశారని టాక్. ఇలా చెప్పుకుంటూ పోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలు పెద్దగా మాట్లాడటం లేదు. అసలు కారణాలు ఏంటి అనేది అర్థం కావటంలేదు.
2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంను నానా మాటలు అన్న… చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన జిల్లాలకు నిధులు కావాల్సి ఉంది. అయినా సరే ఆ ప్రాంతాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించటం లేదు. అంతేకాకుండా రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు కొన్ని నిధులు కావాల్సి ఉంది. వీటి గురించి కూడా ప్రస్తావన లేదు. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. దాని గురించి మాట్లాడటం లేదు. అలాగే రాజధానికి సంబంధించిన నిధులు కూడా ప్రస్తుతానికి కావాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. మరి భవిష్యత్తులో ఆయన ఎంపీలు మాట్లాడతారా లేదో చూడాలి.













