‘రణతంత్రం’లో పశ్చిమాసియా…
పశ్చిమాసియా నిప్పుల కుంపటి మరింతగా రాజుకుంటోంది. ఎర్రసముద్రంలో దాడుల పర్వంతో .. ఈప్రాంతం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో మరో యుద్ధజ్వాల రేగింది. తాజాగా ఈ పోరును రాజేసింది అమెరికా, బ్రిటన్, వాటి మిత్ర దేశాలు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న హౌతీ రెబల్స్‌పై అమెరికా, బ్రిటన్ సైన్యాలు శుక్రవారం తెల్లవారుజామున తొలిసారి ప్రతీకార దాడులు నిర్వహించాయి. యెమెన్‌లో ఈ సాయుధ ముఠాకు సంబంధించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణుల వర్షం కురిపించాయి. యుద్ధవిమానాలతో విరుచుకుపడ్డాయి.
రాజధాని సనా సహా 16 చోట్ల 70కిపైగా లక్ష్యాలను ధ్వంసంచేశాయి. వీటిలో హౌతీల గగనతల రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలు, డ్రోన్, క్షిపణి నిల్వ కేంద్రాలు, వాటి ప్రయోగానికి వాడే స్థావరాలున్నాయి. అల్-దైలామి వైమానిక స్థావరం, హొడైడా, తైజ్, హజ్జా, ధమర్, సాదా నగరాల్లోని విమానాశ్రయాలు, ఇతర శిబిరాలపై దాడులు జరిగాయి. ఈ సైనికచర్య కోసం 100 గైడెడ్ ఆయుధాలు ఉపయోగించినట్లు అమెరికా వాయుసేన ప్రకటించింది. ఈ దాడుల్లో బ్రిటన్ వైమానిక దళానికి చెందిన టైఫూన్ యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. ఫలితంగా ఐదుగురు చనిపోయారని, మరో ఆరుగురు గాయపడ్డారని రెబల్స్ ప్రకటించారు. దీనికి అమెరికా, బ్రిటన్లు మూల్యం చెల్లించుకోకతప్పదని తీవ్ర హెచ్చరిక చేశారు.
ప్రతిదాడులు తప్పవు రెబల్స్
యెమెన్‌పై చేసిన దాడులు మూర్ఖపు చర్యగా అమెరికా, బ్రిటన్ త్వరలోనే తెలుసుకుంటాయని హౌతీ నాయకుడు మహమ్మద్ అల్-బుఖైతీ స్పష్టం చేశారు.ఆ రెండు దేశాలు పెద్ద తప్పు చేశాయి. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయి. నరమేధం జరిపే వారి పక్షాన నిలొవచ్చు.. లేదా బాధితుల వైపు ఉండొచ్చు’’ అని ‘ఎక్స్ ’లో వెల్లడించారు. మరోవైపు.. హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజ్జి మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపై దాడులు ఏమాత్రం ఆగబోవని ప్రకటించారు. అమెరికా, బ్రిటన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘‘ఈ యుద్ధం మరింత పెద్దగా.. అమెరికా, బ్రిటన్ల ఊహకందని రీతిలో ఉంటుంది’’ అని అలీ అల్ ఖ్వాహౌమ్ పేర్కొన్నారు.
సనా, సాదా సహా పలు నగరాల్లో వేల సంఖ్యలో జనం … అమెరికా మిత్రదేశాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజా దాడులను ఇరాన్ ఖండించింది. అమెరికా, బ్రిటన్ల సైనిక చర్యపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కావాలని రష్యా అభిప్రాయపడింది. దాడిని హెజ్బొల్లా, హమాస్ ఖండించాయి. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు పెంచవద్దని, అన్నిదేశాలూ సంయమనం పాటించాలని చైనా కోరింది.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు పాల్పడుతున్నారు.వీటిని నిలువరించాలని వారం క్రితం అమెరికా సహా పలు దేశాలు రెబల్స్‌ను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులు మౌనంగా ఉన్న హౌతీలు మంగళవారం విరుచుకుపడ్డారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారు. వాటిని అమెరికా, బ్రిటన్ యుద్ధనౌకలు కూల్చేశాయి. గత ఏడాది నవంబర్ 19 నుంచి ఇప్పటి వరకు ఎర్రసముద్రంలో 27 దాడులకు హౌతీలు పాల్పడ్డారు.













