అగ్రరాజ్యాధిపతి రేసులో..?
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ ఎన్నికల్లో అధికార డెమొక్రాటిక్ పార్టీ నుంచి అభ్యర్థిగా బైడన్ ఉండగా.. రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం కోసం రేసు జోరుగా నడుస్తోంది. ప్రధానంగా ట్రంప్ రేసులో ముందుగా ఉన్నప్పటికీ.. అందరి దృష్టి ఆకర్షిస్తున్న వ్యక్తి వివేక్ రామస్వామి. భారతీయ మూలాలు ఉన్న వివేక్ రామస్వామి ఓ బిజినెస్ మ్యాన్. వ్యాపార పరంగా విజయవంతమైన వివేక్.. ఇప్పుడు రిపబ్లికన్ల తరపున అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అతని వ్యక్తిత్వం ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ ను ఆకట్టుకుంది.
రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దూకారు యువ మిలియనీర్ వివేక్ రామస్వామి .తనను తాను ‘క్యాపటలిస్ట్ అండ్ సిటిజెన్’గా అభివర్ణించుకున్న ఆయన ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ స్పీచ్‌లు ఇవ్వడం, టెస్ట్ రన్స్ నిర్వహించడం చేస్తున్నారు. అమెరికన్ పెట్టుబడిదారుడు బిల్ అక్మాన్ సంచలన వ్యాఖ్యల కారణంగానే రామస్వామి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. “భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి పోటస్ కోసం పోటీ చేసి గెలుస్తారు!” అని బిల్ అక్మాన్ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. “అతని సందేశం కోసం దేశం సిద్ధంగా ఉందని భావిస్తున్నాను. అతను యువకుడు, తెలివైనవాడు, ప్రతిభావంతుడు. తన మాటలు, చేతలతో ఆకర్షించి గెలిచే సత్తా అతనికి ఉంది. అతను చాలా మంది నమ్మే, బయటకు చెప్పడానికి భయపడే కఠినమైన సత్యాలను మాట్లాడతాడు” అని అక్మాన్ ట్వీట్ చేశారు.
రామస్వామి కేరళ నుంచి యూఎస్ వలస వెళ్లిన భారతీయ తల్లిదండ్రులకు సిన్సినాటిలో జన్మించారు. అతని తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీర్ కాగా.. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి విద్యను అభ్యసించారు. ‘వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’ రచయిత అయిన రామస్వామి ఒక ప్రముఖ బయోటెక్ వ్యవస్థాపకుడు కూడా. అతను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశాడు. రామస్వామి ప్రస్తుత నికర సంపద 500 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. అన్నీ కలిసొస్తే అమెరికా అధ్యక్షుడిగా వివేక్ రామస్వామిని చూడొచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
రామస్వామి హార్వర్డ్ యూనివర్సిటీలో బయోలాజికల్ డిగ్రీని అలాగే యేల్ యూనివర్సిటీలో లా చదువును పూర్తి చేశారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అపూర్వను ఆయన పెళ్లి చేసుకున్నారు. ముందుగా బయోటెక్ కంపెనీని స్థాపించిన రామస్వామి .. లాస్ట్ ఇయర్ ఒక ఆస్తి నిర్వహణ సంస్థను కూడా ప్రారంభించారు. ‘వోక్ ఇంక్’ సహా ఎన్నో పుస్తకాలను రచించిన క్రెడిట్ కూడా రామస్వామికి ఉంది. నిజానికి ఆ పుస్తకాల వల్లే ఆయన చాలా మందికి దగ్గరయ్యారు కూడా.రామస్వామి పుస్తకాలలో పాలనా అంశాలతో పాటు కంపెనీల విధానాలు, సామాజిక అంశాలనూ ప్రస్తావిస్తుండటంతో ఆయనకు అన్ని విషయాలలోనూ విషయ పరిజ్ఞానం ఉందన్న నమ్మకాన్ని అందరిలో కలిగించారు.
రీసెంట్గా ఎమెర్సన్ కాలేజీ వద్ద నిర్వహించిన పోలింగ్‌లో.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 56 శాతం ఓట్లతో మొదటి ప్లేసులో నిలవగా, రెండో ప్లేసులో రామస్వామి, అలాగే ఫ్లోరిడా గవర్నర్ రాన్ డేశాంటిస్ 10 శాతం ఓట్లతో పోటాపోటీగా నిలిచారు. అయితే, రామస్వామి మద్దతుదారుల్లో ఎక్కువ మంది ఆయనకే ఓటు వేస్తామని గట్టిగా చెబుతున్నా..డేశాంటిస్ మద్దతుదారులు పూర్తి నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. మరోవైపు ఈ పోలింగ్‌లో ట్రంప్ మొదటి స్థానంలో కొనసాగుతున్నా కూడా.. ఆయనపై ఉన్న కేసుల వల్ల రెండో స్థానంలో దూసుకుపోతున్న రామస్వామికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాను యుద్ధాలకు, వలసలకు వ్యతిరేకిననని.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని రామస్వామి చెప్పడం అతని ప్రచారంలో ప్లస్ అయింది. అంతేకాదు అమెరికాలో మత స్వేచ్ఛను తాను కాపాడతానని హామీ ఇచ్చారు. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారిన ఎఫ్‌బీఐ, ఐఆర్ఎస్, అణు నియంత్రణ కమిషన్ వంటి ఎన్నో ఫెడరల్ సంస్థలను మూసివేస్తానని రామస్వామి చెబుతూ వస్తున్నారు. మరోవైపు టెస్లా, ఎక్స్ ప్లాట్‌ఫామ్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా రామస్వామికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. అమెరికా ప్రెసిడెంట్ పదవి కోసం రిపబ్లికన్ పార్టీలో పోటీ పడుతున్నవారిలో వివేక్ రామస్వామి దూసుకుపోతుండడంతో … అమెరికా మొత్తం ఈయన పేరు మారుమోగిపోతుంది.
శాకాహారి అయిన వివేక్ రంగస్వామి వ్యాపారవేత్తగానే గాక.. ఇన్వెస్టర్‌గా గుర్తింపుపొందారు. బయోఫార్మాసూటికల్ కంపెనీ ‘రోయివంట్ సైన్సెస్’కు వ్యవస్థాపక సీఈఓ. వోకిఇజం, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్‌పై తన అభిప్రాయాలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికా ప్రముఖ మేగజీన్ ‘ది న్యూయార్కర్’.. వివేక్ రంగస్వామిని ‘యాంటీ-వోక్ సీఈఓ’గా అభివర్ణించింది.
వోక్యిజం అంటే సామాజికంగా, రాజకీయంగా అందరీ న్యాయం జరగడం లేదని బాధపడే సున్నిత మనస్తత్వం లేదా భావజాలం. అయితే వోకియిజం పిడివాద భావజాలం అని వివేక్ వాదిస్తుంటారు. ఇది ప్రపంచంలోని వాస్తవ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం కంటే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంపైనే ఎక్కువ ఆసక్తి కలిగిఉందని చెబుతుంటారు. అందుకే ఈయనను ‘యాంటీ-వోక్ సీఈవో’ అని న్యూ యార్కర్ అభివర్ణించింది.
రాజకీయంగా వివేక్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన అధ్యక్ష రేసులో నిలబడేందుకు సరైన అభ్యర్థి అని చాలా మంది భావిస్తున్నారు. అయితే వివేక్ అభ్యర్థిత్వాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రెసిడెన్సీకి వ్యాపార ఆధారిత విధానాన్ని తీసుకురాగల సరికొత్త వ్యక్తిగా అతడ్ని కొందరు చూస్తున్నారు. మరికొందరేమో అతనికి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదని, వోకియిజంపై అతని ఆలోచనలు వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా.. ఒకవేళ వివేక్ రంగస్వామికి అమెరికా అభ్యర్థిగా నిలబడి, విజయం సాధిస్తే అది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా చెప్పొచ్చు.






