ది ఒరిజినల్ కేరళ స్టోరీ..!
కేరళ అంటేనే మనకు పచ్చని తేయాకు తోటలు, సుందరమైన బీచ్ లు గుర్తుకొస్తాయి. అదే సమయంలో సంపూర్ణ అక్షరాస్యత, డిజిటల్ లిటరసీ.. తదితర అంశాల్లో కూడా కేరళ పేరే ముందుంటుంది. అయితే ఇటీవలికాలంలో కేరళ స్టోరీ అనే సినిమా వచ్చిన తర్వాత, ఆ రాష్ట్రంలో మత మౌఢ్యం ఈ స్థాయిలో ఉందా అనే అనుమానాలు కలిగేలా చేసింది. దానికి తోడు ఇటీవలి ఎన్నికల్లో ఆయా పార్టీలు రాజేసిన మత రాజకీయం మరింత ఆసక్తికర చర్చకు దారి తీసింది. మరి కేరళ ప్రజలు మత రాజకీయాలను అక్కున చేర్చుకున్నారా.. లేక మత సామరస్యానికి జై కొట్టారా?
ది ఒరిజినల్ కేరళ స్టోరీ: భారతీయ రాజకీయ యవనికపై కేరళ ఎప్పుడూ ఒక ప్రత్యేక ప్రయోగశాలగానే కనిపిస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ప్రభుత్వ మార్పునో లేదా పాత పద్ధతులనో ప్రతిబింబించలేదు. అవి భారత ప్రజాస్వామ్యానికి ఒక సరికొత్త పాఠాన్ని నేర్పాయి. దేశవ్యాప్తంగా ఓటింగ్ అంతా మతపరమైన పోలరైజేషన్ వైపు వెళ్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే కేరళ ఓటర్లు మాత్రం మతాలను పక్కనపెట్టి అభ్యర్థి గుణగణాలకే అగ్రతాంబూలం ఇచ్చారు. మతం కంటే అభ్యర్థి ముఖ్యం అనే బలమైన సంకేతాన్ని పంపించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇదే విషయాన్ని వెల్లడించారు. మత సామరస్యానికి ఇదొక కేరళ మోడల్ అని ఆయన అభివర్ణించారు. ఈ విప్లవాత్మక మార్పునకు తవనూర్, కలమశ్శేరి, కొచ్చి నియోజకవర్గాల ఫలితాలే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
మలప్పురం జిల్లాలోని తవనూర్ ఒక కీలక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 50 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉన్నారు. ఇక్కడ క్రైస్తవ జనాభా కేవలం ఒకే ఒక్క శాతం. అయితే అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన క్రైస్తవ అభ్యర్థి వి.ఎస్.జాయ్ ఘనవిజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి కె.టి.జలీల్ పై ఏకంగా 14,647 ఓట్ల మెజారిటీతో జాయ్ విజయం సాధించారు. పైగా ఇక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మెజారిటీ ఓటర్లు తమ సొంత మతస్థుడిని కాదని, ఇతర మతస్థుడికి ఓటేయడం కేరళ రాజకీయాల్లో వచ్చిన పరిణతికి నిదర్శనంగా చెప్పొచ్చు. కేవలం మతమే ప్రాతిపదిక అయితే ఇక్కడ జాయ్ గెలవడం అసాధ్యమయ్యేది, కానీ ప్రజలు ఇక్కడ మతాన్ని చూడలేదు.
ఇవి కూడా చదవండి
అలాగే ఎర్నాకుళం జిల్లాలోని కలమశ్శెరి నియోజకవర్గం కూడా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇక్కడ, హిందూ ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువ. అయితే ఈ నియోజకవర్గంలో IUML అభ్యర్థి వి.ఇ.అబ్దుల్ గఫూర్ విజయఢంకా మోగించారు. CPM కంచుకోటగా భావించే ఈ స్థానంలో మాజీ మంత్రి పి.రాజీవ్ వంటి దిగ్గజంపై గఫూర్ 16వేలకు పైగా ఓట్లతో గెలిచారు. ఇక్కడ హిందూ ఓటర్లు సైతం మతపరమైన సంకెళ్లను తెంచుకుని ఓటేశారు.
మరోవైపు కొచ్చి నియోజకవర్గంలోనూ ఇదే రకమైన సామరస్య ధోరణి కనిపించింది. క్రైస్తవ సామాజిక వర్గం నిర్ణయాత్మక శక్తిగా ఉండే ఈ ప్రాంతంలో ముస్లిం అభ్యర్థి మహమ్మద్ షియాస్ విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన షియాస్, CPMకు చెందిన క్రైస్తవ అభ్యర్థి కె.జె.మ్యాక్సీపై 8 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొచ్చి వంటి నియోజకవర్గాల్లో మతం కీలక పాత్ర పోషిస్తుందనే అంచనాలు ఈ తీర్పుతో తలకిందులయ్యాయి.
కేరళ అనగానే బయటి ప్రపంచానికి తరచూ కేరళ ఫైల్స్ లాంటి సినిమాల ప్రభావం వల్ల ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్ కలుగుతుంటుంది. కానీ, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తాజా ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ముస్లింలు ఎక్కువ ఉన్న చోట్ల క్రైస్తవులు, హిందూ ప్రభావం ఉన్న చోట ముస్లింలు, క్రైస్తవ ప్రాబల్యం ఉన్న చోట ముస్లిం అభ్యర్థి గెలవడం డెమొక్రటిక్ బ్యూటీ. రాజకీయ పార్టీల పొత్తులు, క్రాస్-కమ్యూనిటీ ఓటింగ్ లాంటివి ఇక్కడ బలంగా పని చేసి ఉండొచ్చు. కులమతాల రంగు పూయకుండా కేవలం అభివృద్ధి, స్థానిక సమస్యలే అజెండాగా సాగిన ఈ ఎన్నికలు కేరళ ప్రజల రాజకీయ చైతన్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి.
కేరళ ఎన్నికల ఫలితాలు విద్వేష రాజకీయాలకు ఒక గట్టి హెచ్చరిక లాంటివి. ఓటర్లు మతపరమైన గోడలను కూల్చేసి, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని నిరూపించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కేరళ తన తీర్పు ద్వారా సుస్థిరం చేసింది.
ఇవి కూడా చదవండి








