The Kerala Story2: హైకోర్టులో ‘ది కేరళ స్టోరీ2’కు ఊరట.. రిలీజ్ కు రూట్ క్లియర్
ఇటీవల కాలంలో భారీ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన చిత్రం ది కేరళ స్టోరీ 2(the kerala story) విడుదలపై నెలకొన్న అనిశ్చితి తొలగింది. 2023లో విడుదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ది కేరళ స్టోరీ మూవీకి ఇది సీక్వెల్. ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాపై సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. సినిమాలోని కంటెంట్ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇచ్చిన యూ/ఏ సర్టిఫికేట్‌పై అభ్యంతరం వ్యక్తమైంది.
పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ బెంచ్, సీబీఎఫ్సీ తీరును ప్రశ్నిస్తూ సినిమాను పునఃపరిశీలించాలని ఆదేశించింది. అలాగే రెండు వారాలపాటు విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. దీనిపై చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ పి.వి. బాలకృష్ణన్లతో కూడిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకి తొలగినట్టైంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కామాఖ్య నారాయణ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను విపుల్ అమృత్షా లాల్ నిర్మించారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ పేరుతో హిందూ యువతులను మోసం చేసే అంశాలను ట్రైలర్లో చూపించడంతో ఈ సినిమా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది. పినరాయి విజయన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునివ్వగా, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లాంటి సినీ ప్రముఖులు దీనిని ప్రోపగాండా సినిమాగా విమర్శించారు. వివాదాల నడుమ విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో, ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.








