ప్రారంభమైన బలగాల ఉపసంహరణ… మోదీ ప్రభుత్వ విజయం
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చైనా విషయంలో అతిపెద్ద విజయాన్ని సాధించింది. సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా కవ్వింపు చర్యలకు దిగిన నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయ్యింది. ఇరు దేశాలు కూడా లడక్ వద్ద బలగాలను మోహరించుకున్నాయి. చర్చోప చర్చలు జరిగినప్పటికీ కూడా ఇరు దేశాలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తూర్పు లడఖ్, గాల్వన్ లోయ, పాంగాంగ్ సెక్టార్ వద్ద చైనా తన బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో అనేక రౌండ్ల పాటు దౌత్య, మిలటరీ స్థాయి చర్చలు జరిగాయి. తాజాగా జరిగిన మిలటరీ స్థాయి చర్చల ద్వారా బలగాలను సరిహద్దుల నుంచి ఇరు దేశాలూ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఏప్రిల్ 20 న ఏ స్థితి అయితే నెలకొని వుందో… ఆ స్థితికే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి. పాయింట్ 4 నుంచి పాయింట్ 8కు చైనా బలగాలు తిరుగుముఖం పట్టాయి. భారత్ బలగాలు పాయింట్ 1 కు చేరుకోనున్నాయి. మరో 48 గంటల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. చైనా నిర్మించిన బంకర్లు ధ్వంసం చేయడంతో పాటు, ట్యాంకర్లు వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకూ పూర్తయ్యేలా రూపకల్పన జరిగింది.
సక్సెస్ అయిన మోదీ ప్రభుత్వం
చైనాతో ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పటి నుంచీ మోదీ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రం మాత్రం ఒక్క అంగుళం కూడా చైనాకు వదిలేది లేదని తేల్చి చెప్పింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కారం చేసుకుంటామని భారత్ పదే పదే ప్రకటించింది. చైనా బలగాలు ఎన్ని కుయుక్తులు పన్ని, భారత్‌ను ఎంత రెచ్చగొట్టినా… బలగాలు మాత్రం రెచ్చిపోలేదు. వారికి దీటైన జవాబునిస్తూనే వచ్చింది భారత సైన్యం. చివరికి.. చర్చల ద్వారానే మోదీ ప్రభుత్వం బలగాల ఉపసంహరణ ప్రక్రియను సాధించింది. ఎక్కువ సంఖ్యలో జవాన్ల ప్రాణాలను కోల్పోకుండా, అదే సమయంలో చైనాకు దీటుగా సమాధానమిస్తూ మోదీ ప్రభుత్వం విజయం సాధించింది.
చైనా, భారత్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల భద్రతా బలగాల ఉపసంహరణ విషయంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేశారు. తూర్పు లడఖ్‌లో ఉన్న ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ దిశగా చర్చలు జరుగుతున్నాయని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఈ మేరకు చైనాతో ఒప్పందం కూడా జరిగిందని తెలిపారు. ఈ చర్చల తర్వాతే సైనిక బలగాల ఉపసంహరణపై అంగీకారం కుదిరిందని అన్నారు. అయితే ఈ ఒప్పందాల వల్ల భారత్‌కు వచ్చిన నష్టమేమీ లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. చైనా దూకుడుగా వ్యవహరించినప్పటికీ మన దేశ సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి, నిలువరిచారని ప్రశంసలు కురిపించారు. రాజ్‌నాథ్ చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ తగాదాలకు ఇక తెరపడినట్టేనని అందరూ భావిస్తున్నారు.
ఒక్క అంగుళం కూడా వదులుకోం : రాజ్‌నాథ్
ఒక్క అంగుళం భూమిని కూడా చైనాకు వదులుకునే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ కుండబద్దలు కొట్టారు. చైనా ఒప్పందాలను తుంగలో తొక్కి మరీ ఎల్ఏసీ వెంబడి భారీగా బలగాలను మోహరించిందని, అయినా భారత సైన్యం దీటుగా ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే తెగువ సైన్యానికి ఉందని ఆయన తెలిపారు. ఏ దేశమైనా ఏకపక్షంగా ఎల్ఏసీని మార్చే ప్రయత్నం చేయరాదని, ఇరు దేశాల వైపు నుంచీ ప్రయత్నాలు జరిగితేనే ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయని చైనాకు చురకలంటించారు. పాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరాన నెలకొన్న ఫింగర్ 8 వద్ద చైనా బలగాలు ఉంటాయని, భారత బలగాలు ఫింగర్ 2 వద్ద ఉన్న పర్మంట్ బేస్ వద్ద ఉంటాయని ఆయన తెలిపారు.
భారత్ సత్తా ఏంటో డ్రాగన్‌కు తెలిసొచ్చింది : రాజ్‌నాథ్
భారత సైన్యం సత్తా ఏమిటో చైనాకు కూడా తెలిసొచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. అయితే ఈ బలగాల ఉపసంహరణ కారణంగా భారత్‌కు నష్టం లేదని, చైనాకు మనమేమీ ఇవ్వలేదని లోక్‌సభలో ప్రకటించారు. భారత దేశ జవాన్ల శౌర్యం, పరాక్రమం వల్లే భారత్ పై చేయి సాధించగలిగిందని హర్షం వ్యక్తం చేశారు. కఠోరమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత సైన్యం ధీరోదాత్తంగా పోరాడిందని ఆయన ప్రశంసించారు. దేశ ప్రాదేశిక సమగ్రత పూర్తి సురక్షితంగా ఉందని రాజ్‌నాథ్ ప్రకటించారు.
45 మంది చైనా సైనికులు గాల్వాన్‌లో మృతి చెందారు :
తూర్పు లడఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు మృతి చెందారని రష్యా వార్త సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఈ ఘర్షణలో చైనా సైనికులెవ్వరూ మృతి చెందలేదని చైనా బీరాలు పలికింది. కానీ… 45 మంది చైనా సైనికులు మరణించారని రష్యా అధికారిక మీడియా వెల్లడించింది. దీంతో చైనా ఇరకాటంలో పడిపోయింది. చైనా సైనికులు మరణించారని అమెరికా కూడా అప్పట్లో ప్రకటించింది. అయితే ఈ వార్తలను చైనా తోసిపుచ్చింది. జూన్ 15 న గాల్వాన్ లోయలో చైనా, భారత్ మధ్య ఘర్షణ జరిగింది. చైనా సైనికులు ముళ్లు, రాడ్లతో భారత సైనికులపై పాశవికంగా దాడికి దిగారు. కల్నల్ సంతోష్ బాబుతో సారథ్యంలో జవాన్లు చైనాకు దీటైన జవాబునే ఇచ్చారు. ఈ ఘటనలో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన విషయం తెలిసిందే.













