Dhaka: రాజకీయ లెజెండ్ ఖలీదా జియా ఇక లేరు.. బంగ్లా రాజకీయాల్లో ముగిసిన శకం…!
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్ పర్సన్ బేగమ్ ఖలీదా జియా మృతి.. ఆ దేశానికి తీరనిలోటుగా చెప్పవచ్చు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న ఖలీదా జియా.. బంగ్లాదేశ్ పురోగతిలో తనదైన ముద్ర వేశారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ సంబంధాలు మెరుగుదలలోనూ తనదైన పాత్ర పోషించారు. అయితే కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో.. ఆమె క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. దీంతో విదేశాల్లోని ఆమె కుమారుడు తారిఖ్ రెహ్మాన్.. అక్కడి నుంచే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు.
ఖలీదా జియా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ఆమె సృష్టించిన చరిత్రను గుర్తుచేసుకుంటూ, ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. “బంగ్లాదేశ్ అభివృద్ధిలో, అలాగే భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు” అని మోడీ పేర్కొన్నారు. 2015లో ఢాకా పర్యటన సందర్భంగా ఆమెతో జరిగిన భేటీని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
1981లో తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ హత్య తర్వాత ఖలీదా జియా రాజకీయాల్లోకి వచ్చారు. ఎర్షద్ సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి, 1991లో బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె షేక్ హసీనాతో దశాబ్దాల పాటు కొనసాగించిన రాజకీయ వైరం బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. హసీనా ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించిన జియా, ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యారు.
జియా మృతి పట్ల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవలే లండన్ నుంచి తిరిగి రాగా, తల్లి చివరి క్షణాల్లో ఆసుపత్రిలోనే ఉన్నారు. ఖలీదా జియా మృతితో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది.






