‘మహా’ రాజకీయాలు
మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేడు ప్రధాన మంత్రి మోడీ మరాఠాగడ్డపై పర్యటించనున్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మహారాష్ట్రకు రానున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతల పర్యటన.. మహారాష్ట్రను వేడెక్కిస్తోంది. ఇది మహా బలప్రదర్శన కానుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మోడీ, కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు..? ఎవరిని టార్గెట్ చేస్తారన్నది అన్నది ఆసక్తికరంగా మారింది.
జాతీయ రాజకీయాలవైపు అడుగులేస్తున్న బీఆర్ఎస్ అధినేత.. మరాఠా గడ్డపై పార్టీ బలోపేతంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మహారాష్ట్రలో పర్యటించిన సీఎం కేసీఆర్.. అక్కడ స్థానికనేతలు, ప్రముఖులను బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణలో రోల్‌మోడల్ పాలన.. మహారాష్ట్రలోనూ అందిస్తామంటున్నారు. మా పథకాలు చూడండి.. మీ పరిస్థితి చూడండంటూ మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్కు ఓటేయండి.. సంక్షేమ పాలన అందుకోవాలని సూచిస్తున్నారు.
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా కేసీఆర్…. ప్రముఖ సంస్కర్త, జానపదకళాకారుడు, రచయిత అన్నాబవుసాతే.. జన్మదిన వేడుకలకు హాజరుకానున్నారు. బావుసాతే మహారాష్ట్రలోని ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మాతంగ్ కు చెందిన వారు. మహారాష్ట్రలో అధికంగాఉన్న ఈ కమ్యూనిటీ ఓట్లను సొంతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్. దీంతో పాటు కొల్హాపూర్‌లోని అంబాబాయి మందిర్‌ను దర్శించుకోనున్నారు.
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ… పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేయనున్నారు. పుణెలోని దగ్దుసేత్ మందిర్‌ను మోడీ దర్శించుకుంటారు. అలాగే తిలక్ స్మారక ట్రస్ట్ అందించే లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును మోడీ అందుకోనున్నారు. దేశ అభివృద్ధికోసం అద్వితీయంగా కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డు ప్రధానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా తిలక్ వర్థంతి సందర్భంగా ఈ అవార్డు ప్రధానం జరుగుతోంది. లోకమాన్య తిలక్ అవార్డు అందుకోనున్న 41వ వ్యక్తి ప్రధానమంత్రి మోడీ.. గతంలో మాజీ రాష్ట్రపతులు శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పాయి, డాక్టర్ మన్మోహన్సింగ్, ఇతర ప్రముఖులు ఈఅవార్డు అందుకున్నవారిలో ఉన్నారు.













