విచ్ఛిన్నం దిశగా పాక్..?
పాకిస్తాన్ కనీవినీ ఎరుగని విపత్తుతో తల్లడిల్లుతోంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దాయాది దేశాన్ని తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి నెట్టేశారు. పాలనలో ఇమ్రాన్ ఒరగబెట్టింది లేకున్నా, ప్రజల్లో మాత్రం ఆయనపట్ల వరల్డ్ కప్ హీరో అన్న భావన కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలతో ఇమ్రాన్ ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేయడంతో వీధుల్లోకి వచ్చి జనం ఆందోళనలు చేస్తున్నారు. వీటికి తోడు ఇమ్రాన్ సైతం.. మరింతగా ఆందోళనలు చేయాలంటూ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు. అసలే ఆర్థిక సంక్షోభం, ఆపై తిండికి సైతం బాధలు పడుతున్న జనం.. ఇప్పుడివన్నీ పక్కకు పోయి ఇమ్రాన్ అరెస్టు అన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇమ్రాన్ ఖాన్ కొంతకాలంగా పాకిస్తాన్ సైన్యంపై, ఐ.ఎస్.ఐ పై, అలాగే న్యాయవ్యవస్థపై కూడా విరుచుకుపడుతున్నారు. వీళ్ళందర్నీ దోషులుగా చూపిస్తున్నారు.. వీళ్లంతా అమెరికా చెప్పు చేతుల్లో నడుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.అయితే న్యాయవ్యవస్థలో కొంతమంది ఇమ్రాన్ ఖాన్ కు ఫేవరబుల్ గా మారినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా ఉన్నాడని ఆయనను రాజీనామా చేయమనే పరిస్థితి వచ్చింది.
ఇక్కడ ఇంకో ట్విస్ట్.. పాక్ సైన్యం కూడా రెండుగా విడిపోయింది. పాక్ ఆర్మీలో ప్రధాన వర్గం.. ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఉంటే, మరోవర్గం మాత్రం ఇమ్రాన్ కు కొమ్ముకాస్తొందని సమాచారం. గతంలో చాలా మంది పొలిటీషియన్స్.. పదవి పోగానే విదేశాలకు పారిపోయి, అక్కడ ఆశ్రయం పొంది, పరిస్థితులు బాగా ఉన్నప్పుడు వెనక్కు వచ్చేవారు. కానీ ఇమ్రాన్ అలా కాదు.. పాక్ లో ఉంటూనే.. అక్కడి సైన్యానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు. నేరుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలుచిస్తాన్ లో పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీ.. అత్యంత క్రూరంగా అణచివేస్తున్నా, వారు వెనక్కి తగ్గడం లేదు. పాక్ నుంచి స్వతంత్రం కావాలని నినదిస్తున్నారు. దీనికి తోడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే గ్రూపు కూడా తయారైంది. ఇక తెహ్రిక్ ఏ తాలిబన్ అయితే ఏకంగా పాక్ ఆర్మీపైనే దాడులకు తెగబడుతోంది. ఇమ్రాన్ కు ఈ గ్రూప్ ప్రతినిధులు సంఘీబావం కూడా ప్రకటించారు.
ఈ పరిస్థితులు చూస్తుంటే పాక్ విచ్ఛిన్నం దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫైబర్ ఫక్తూనాతో పాటుగా సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రాలు కూడా పాక్ నుంచి విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. వీటిని అదుపు చేయలేని పాక్ పాలకులు పొరుగున ఉన్న భారత్.. ఆందోళనలను పోత్సహిస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.













